కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) డివిజన్‌లో జూలై 17న అటవీ భూమి పరిరక్షణ పనుల సందర్భంగా జరిగిన ఘటనపై అటవీ శాఖ తీవ్రంగా స్పందించింది. మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోల నేపథ్యంలో సమగ్ర, నిష్పక్షపాత విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా, వీడియోలో మహిళతో తోపులాటకు దిగినట్లు కనిపించిన ఫారెస్ట్ బీట్ అధికారిని విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తూ తక్షణ పరిపాలనా చర్యలు తీసుకుంది.
ఈ ఘటనపై పూర్తి వాస్తవాలను వెలికితీసేందుకు కిన్నెరసాని ఫారెస్ట్ డివిజనల్ అధికారి అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అసలు వీడియోలు, ఫొటోలు, వైద్య నివేదికలను అందజేసిన అటవీశాఖ.. పోలీసు విచారణకు పూర్తి సహకరం అందిస్తామని వెల్లడించింది. విచారణలో సిబ్బంది నిర్లక్ష్యం, అవసరానికి మించిన బలప్రయోగం జరిగినట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.
అయితే, ఈ ఘటనను ఏ రెండు వర్గాల మధ్య వివాదంగా చూడరాదని, ప్రభుత్వ అటవీ భూములను రక్షించడం తమ చట్టబద్ధమైన బాధ్యతని అటవీ శాఖ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి సున్నితమైన కార్యక్రమాలను పోలీసు సమన్వయం, మహిళా సిబ్బంది, నిరంతర వీడియో రికార్డింగ్‌తోనే నిర్వహిస్తామని వెల్లడించింది. అసంపూర్ణ వీడియోల ఆధారంగా ముందస్తు నిర్ణయాలకు రావద్దని, నిజానిజాలు తేలడానికి ప్రజలు, మీడియా సహకరించాలని అటవీ శాఖ విజ్ఞప్తి చేసింది.

