కలం, నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి (Narketpally) జాతీయ రహదారిపై ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోయారు. గోపాలయాపల్లి సమీపంలోని పూజిత హోటల్ వద్ద శనివారం ఒక ప్రయాణికుడి నుంచి సుమారు రూ.10 లక్షల నగదు ఉన్న బ్యాగును దుండగులు అపహరించారు.
పోలీసులు, బాధితుడి వివరాల ప్రకారం.. ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులు అల్పాహారం చేసేందుకు పూజిత హోటల్ వద్ద నిలిపివేశారు. ఈ బస్సులో ప్రయాణిస్తున్న ఆరే రవీందర్ రెడ్డి కూడా కిందకు దిగారు. ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని దొంగలు, రవీందర్ రెడ్డి సీట్లో ఉంచిన రూ.10 లక్షల నగదు బ్యాగును ఎత్తుకెళ్లారు.
పని చేయని సీసీ కెమెరాలు..
బాధితుడి ఫిర్యాదు మేరకు నార్కట్‌పల్లి పోలీసులు (Narketpally Police) తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హోటల్ వద్ద కొద్దిరోజులుగా సీసీ కెమెరాలు పని చేయడం లేదని హోటల్ యజమాని తెలపడంతో నిందితులను గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది.
గతంలో కూడా ఇదే పూజిత హోటల్ వద్ద పలుమార్లు బస్సు ప్రయాణికుల నుంచి దొంగలు డబ్బులు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిన సంఘటనలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. హైవే హోటళ్ల వద్ద వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.
Read Also: జొన్న రొట్టె తినడమే మేలు: విప్ బీర్ల అయిలయ్య
Follow Us On: Sharechat

