కలం, వెబ్‌డెస్క్: ప్రపంచమంతా ఇప్పుడు ఒకే ఫీవర్తో ఊగిపోతున్నది.. ఒకే మాటతో మార్మోగుతున్నది.. అదే ఫిఫా (FIFA)..! ఖండాల మధ్య సరిహద్దులు చెరిగిపోయాయి.. దేశాల మధ్య వైరం మరుగునపడింది.. కోట్లాది గుండెలు ఇప్పుడు ఒకే రిథమ్‌తో కొట్టుకుంటున్నాయి. ఇవాళ అర్ధరాత్రి అమెరికాలోని మెట్లైఫ్ స్టేడియం (MetLife Stadium) కేవలం ఓ స్టేడియం మాత్రమే కాదు… యావత్ భూగోళం చూపులన్నింటినీ తనవైపు తిప్పుకున్న ఓ కేంద్రబిందువు.
రెండు దశాబ్దాలుగా ప్రపంచ ఫుట్‌బాల్ తన ఎడమ కాలి మాయాజాలంతో శాసించిన మహా మాంత్రికుడు లియోనెల్ మెస్సి… మరోవైపు తన వేగం, ధైర్యం, అసాధారణ ప్రతిభతో కొత్త యుగానికి నాంది పలుకుతున్న యువ తుఫాన్ లామిన్ యమాల్.. ఇది కేవలం ఇద్దరు ఆటగాళ్ల మధ్య పోరు కాదు.. రెండు జట్ల మధ్య ఫైనల్ అంతకంటే కాదు.. ఇది రెండు తరాల ఢీ. ఒకవైపు చరిత్ర.. మరోవైపు భవిష్యత్తు. ఒకవైపు ప్రపంచాన్ని ఏలిన దిగ్గజం.. మరోవైపు ఏలాలని వస్తున్న కొత్త తరం.
ఈ మహా సమరాన్ని చిరస్మరణీయంగా మార్చే విధి రాసిన అద్భుత కథ ఇంకోటి ఉంది. ఒకప్పుడు ఐదు నెలల పసికందుగా ఉన్న లామిన్ యయాల్ను ప్రేమగా చేతుల్లోకి ఎత్తుకుని స్నానం చేయించిన వ్యక్తి మెస్సి. ఆ పసివాడే.. నేడు అదే మెస్సికి ఎదురుగా నిలబడి తన సింహాసనానికే సవాల్ విసురుతున్నాడు. ఒకప్పుడు మెస్సీని చూసి కలలు కన్న తరం… ఇప్పుడు అతడితోనే ప్రపంచ వేదికపై తలపడుతున్నది. విధి రాసిన ఈ అద్భుత కథకు ఇప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్ వేదికే రంగస్థలం.
ఒక ట్రోఫీ.. ఇద్దరు మహా కథానాయకులు.. ఒకే వేదిక… ప్రపంచమంతా చూపు! ఈ అర్ధరాత్రి తర్వాత మెట్లైఫ్ స్టేడియంలో జరగబోయేది ఫైనల్ కాదు… చరిత్రతో భవిష్యత్తు తలపడుతున్న క్షణం. ఒక శకం ముగుస్తుందా? లేక మరో శకం పుడుతుందా? అన్న ప్రశ్నకు యావత్ ప్రపంచం శ్వాస బిగబట్టి ఎదురుచూస్తున్నది.
ప్రపంచం ఎదురుచూసిన క్షణం వచ్చేసింది..! దాదాపు నెలన్నర రోజులుగా యావత్ భూగోళాన్ని ఫుట్‌బాల్ మత్తులో ముంచెత్తిన మహా సంగ్రామం ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. మొత్తం 48 జట్లు.. వందలాది కలలు.. కోట్లాది అభిమానుల భావోద్వేగాల మధ్య చివరకు మిగిలింది రెండు జట్లు మాత్రమే. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా.. యూరోపియన్ ఛాంపియన్ స్పెయిన్.. అమెరికా న్యూజెర్సీ మెట్లైఫ్ స్టేడియం వేదికగా ఆదివారం అర్ధరాత్రి జరిగే 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో (FIFA World Cup Final)ఈ రెండు ఫుట్‌బాల్ మహాశక్తులు ప్రపంచ కిరీటం కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఈ మెగా టోర్నీలో ఆతిథ్య దేశాలైన అమెరికా, కెనడా, మెక్సికోతో పాటు బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, పోర్చుగల్ వంటి దిగ్గజాలు ఒక్కొక్కటిగా నిష్క్రమించాయి. కానీ ఒత్తిడిని తట్టుకుని, ప్రతి అడ్డంకిని దాటుకుని అర్జెంటీనా, స్పెయిన్ మాత్రమే తుది పోరుకు చేరుకున్నాయి. ఒకవైపు వరుసగా రెండో ప్రపంచ కప్ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాలని అర్జెంటీనా ఉవ్విళ్లూరుతుంటే.. మరోవైపు ఎన్నో ఏండ్ల నిరీక్షణకు తెరదించి మరోసారి ప్రపంచ ఫుట్‌బాల్ సింహాసనాన్ని అధిరోహించాలని స్పెయిన్ పట్టుదలగా ఉన్నది. అయితే, ఈ ఫైనల్ ప్రత్యేకత కేవలం ట్రోఫీతో ముగిసిపోదు. అనుభవం వర్సెస్ యువశక్తి.. వారసత్వం వర్సెస్ కొత్త శకం.. లెజెండ్ల కలలకు, కొత్త తరం ఆశయాలకు మధ్య జరిగే మహా సమరంగా ఇది చరిత్రలో నిలిచిపోనుంది.
ఓటమే తెలియని స్పెయిన్
ఈ మెగా టోర్నీలో స్పెయిన్ జట్టు అసాధారణ ఆటతీరుతో ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ఫైనల్‌కు చేరుకుంది. తొలి మ్యాచ్లో కేప్ వెర్డేతో డ్రా అయిన తర్వాత ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా వరుసగా ఆరు విజయాలతో తిరుగులేని జట్టుగా నిలిచింది. ఏడు మ్యాచ్లో కేవలం ఒక్క గోల్ మాత్రమే సమర్పించుకుని టోర్నీలోనే అత్యంత పటిష్ఠమైన రక్షణ శ్రేణి కలిగిన జట్టుగా గుర్తింపు పొందింది. సెమీఫైనల్లో టైటిల్ ఫేవరెట్ ఫ్రాన్స్‌ను 2-0తో మట్టికరిపించి ఫైనల్లో అడుగుపెట్టింది.
చిన్న పాస్తో చీల్చిచెండాడే తత్వం
స్పెయిన్ బలం కేవలం ఫలితాల్లోనే కాదు… వారి ఆటతీరులోనూ కనిపిస్తుంది. బంతిని ఎక్కువసేపు తమ ఆధీనంలో ఉంచుతూ, వేగవంతమైన చిన్న పాస్లతో ప్రత్యర్థి డిఫెన్స్‌ను చీల్చిచెండాడే శైలే ఆ జట్టు ప్రధాన ఆయుధం. అవకాశం దొరికిన ప్రతిసారీ దాడులు చేస్తూ ప్రత్యర్థిని నిరంతరం ఒత్తిడిలో ఉంచడం స్పెయిన్ ప్రత్యేకత.
వీరే వెన్నెముక..
ఫార్వర్డ్ మికెల్ ఒయర్జబాల్ ఐదు గోల్స్తో జట్టు దాడికి నాయకత్వం వహిస్తుండగా… మిడ్ఫీల్డ్లో రోడ్రి, ఫాబియన్ రూయిజ్ ఆటను నియంత్రిస్తూ జట్టుకు వెన్నెముకలా నిలుస్తున్నారు. వింగ్స్‌లో లామిన్ యమాల్, డాని ఓల్మో తమ వేగం, డ్రిబ్లింగ్‌తో ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇక డిఫెన్స్‌లో ఐమెరిక్ లాపోర్టే, పావు కుబార్సి జోడీ గోడలా నిలవగా… గోల్కీపర్ యునై సిమోన్ ఎన్నో కీలక సేవ్లతో స్పెయిన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దూకుడైన దాడి, కట్టుదిట్టమైన డిఫెన్స్, సమష్టి ప్రదర్శన… ఈ మూడింటి సమ్మేళనమే స్పెయిన్‌ను టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలబెట్టింది.
విమర్శల మధ్యే..
డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఈ టోర్నీలో తన ఛాంపియన్ ముద్రను మరోసారి చాటుకుంది. కోచ్ లియోనెల్ స్కాలనీ సారథ్యంలో వరుసగా ఏడు విజయాలు నమోదు చేసిన ఆ జట్టు.. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఫైనల్‌కు దూసుకొచ్చింది. దూకుడుగా కాకుండా ఓర్పుతో ఆటను నిర్మించడం, ప్రత్యర్థి బలహీనతలను కచ్చితంగా గుర్తించి ఒక్కసారిగా దాడి చేయడం అర్జెంటీనా ప్రత్యేకత. అనుభవం, క్రమశిక్షణ, కచ్చితమైన వ్యూహాలతో ప్రతి మ్యాచ్లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ మరోసారి ప్రపంచకప్ కిరీటానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది.
తీవ్ర వివాదాలు
అర్జెంటీనా ప్రయాణం అంతా విజయాల గురించే కాదు… తీవ్ర వివాదాలకూ వేదికైంది. రౌండ్ ఆఫ్-16లో ఈజిప్ట్ సాధించిన గోల్‌ను వీడియో అసిస్టెంట్ రిఫరీ రద్దు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అనంతరం క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలోకు చూపిన రెడ్ కార్డ్ కూడా వివాదాస్పదంగా మారింది. ఈ రెండు నిర్ణయాల తర్వాత సోషల్ మీడియాలో #RiggedWorldCup హ్యాష్ ట్యాగ్ వైరల్‌గా మారగా, మెస్సీ కోసమే టోర్నీని ఫిక్స్ చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అర్జెంటీనాను టోర్నీ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది అభిమానులు ఆన్లైన్ పిటిషన్‌కు మద్దతు ఇవ్వడం ప్రపంచ ఫుట్‌బాల్‌లో పెద్ద చర్చకు దారితీసింది.
ఎలాంటి దయాదాక్షిణ్యాల్లేవు
ఈ విమర్శలకు కెప్టెన్ లియోనెల్ మెస్సీ మైదానంలోనే సమాధానం ఇచ్చాడు. ‘‘మా విజయాల వెనుక ఎలాంటి దయాదాక్షిణ్యాలు లేవు… మా కష్టం, మా ఆట మాత్రమే ఉంది’’ అని స్పష్టం చేసిన మెస్సీ.. సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 2-1 విజయంతో జట్టును ఫైనల్‌కు నడిపించాడు. టోర్నీలో ఇప్పటికే ఎనిమిది గోల్స్తో మెస్సీ గోల్డెన్ బూట్ రేసులో ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపేతో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఒత్తిడిని తట్టుకునే మనస్తత్వం
మెస్సికి తోడుగా లౌటారో మార్టినెజ్ మూడు గోల్స్ తో దాడిలో కీలక పాత్ర పోషిస్తుండగా, మిడ్ఫీల్డుల్లో ఎంజో ఫెర్నాండెజ్ తన చురుకైన ఆటతో జట్టుకు బలంగా నిలిచాడు. ఇక గోల్పోస్ట్ ముందు ఎమిలియానో మార్టినెజ్ మరోసారి అద్భుతమైన సేవ్లతో ప్రత్యర్థులకు గోడలా మారాడు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు, సమష్టి ఆట, ఒత్తిడిని తట్టుకునే మనస్తత్వం..ఈ మూడింటి బలంతో అర్జెంటీనా వరుసగా రెండో ప్రపంచకప్ కిరీటంపై కన్నేసింది.
మెస్సిని చూసి పెరిగినోళ్లే.. ప్రత్యర్థులు
ఈ ఫైనల్‌కు మరో ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఒకప్పుడు మెస్సి ఆటను చూస్తూ పెరిగిన చిన్నారులే ఇప్పుడు అతడికి ప్రత్యర్థులుగా మారారు. బార్సిలోనా రోజుల్లో మెస్సీతో అనుబంధం ఉన్న స్పెయిన్ ఆటగాళ్లు నేడు ప్రపంచకప్ వేదికపై అతడి సవాల్‌కు సిద్ధమయ్యారు.
– అందరిలో ప్రత్యేకమైన కథ లామిన్ యమాల్ది. 2007లో యూనిసెఫ్ ఛారిటీ ఫొటోషూట్‌లో ఐదు నెలల పసికందుగా ఉన్న యమాల్‌ను మెస్సి చేతుల్లోకి తీసుకున్నాడు. నాడు మెస్సి ఒడిలో ఉన్న ఆ చిన్నారి… నేడు అదే మెస్సీకి ఫైనల్లో ప్రత్యర్థిగా నిలవడం విధి రాసిన వింత కథ.
– యమాల్‌తో పాటు లా మాసియా నుంచి ఎదిగిన గావి, మెస్సీని ఆదర్శంగా చూసిన డాని ఓల్మో, చిన్నతనంలో అతడితో ఫొటోలు దిగిన గోల్కీపర్ జోవాన్ గార్సియా కూడా ఇప్పుడు స్పెయిన్ జెర్సీలో మెస్సీకి ఎదురుగా నిలిచారు. ఒకప్పుడు మెస్సిని చూసి కలలు కన్న తరం… ఇప్పుడు అతడితోనే ప్రపంచ వేదికపై తలపడుతున్నది.
చివరి ప్రపంచకప్ వేటలో మెస్సి!
39 ఏళ్ల వయసులో లియోనెల్ మెస్సి ఆడుతున్న ఈ ప్రపంచకప్ ఫైనల్.. అంతర్జాతీయ కెరీర్లో అతడి చివరి మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. 2022లో తన చిరకాల స్వప్నమైన ప్రపంచకప్‌ను అందుకున్న మెస్సీ, ఇప్పుడు మరోసారి కప్ను ముద్దాడి తన కెరీర్‌కు చిరస్మరణీయ ముగింపు ఇవ్వాలని చూస్తున్నాడు. బ్రెజిల్ (1962) తర్వాత వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెలిచిన జట్టుగా అర్జెంటీనాను చరిత్రలో నిలబెట్టాలన్న లక్ష్యంతో ఫైనల్ బరిలోకి దిగుతున్నాడు.
సమాన బలాలు.. తేల్చుకోవాల్సిన పాత లెక్కలు
అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య పోరు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగింది. ఇప్పటివరకు ఇరు జట్లు 14 సార్లు తలపడగా… స్పెయిన్ ఆరు విజయాలు సాధించగా, అర్జెంటీనా కూడా ఆరు మ్యాచ్లో గెలిచింది. మరో రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అయితే అర్జెంటీనా మనసులో ఓ పాత గాయం ఇంకా మిగిలే ఉంది. 2018లో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో స్పెయిన్ చేతిలో 6-1తో ఎదురైన ఘోర పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని మెస్సీ సేన పట్టుదలగా ఉంది. ఆ ఓటమికి బదులు చెప్పడంతో పాటు, ప్రపంచకప్ ట్రోఫీని అందుకోవాలన్న లక్ష్యంతో అర్జెంటీనా తుది పోరుకు సిద్ధమవుతున్నది.
ప్రధాన రిఫరీగా విన్సిచ్
ఈ టోర్నీలో అర్జెంటీనా మ్యాచ్‌ల చుట్టూ చోటుచేసుకున్న రిఫరింగ్ వివాదాల నేపథ్యంలో ఫైనల్ కోసం ఫిఫా అత్యంత అనుభవజ్ఞులైన అఫీషియల్స్ బృందాన్ని రంగంలోకి దించింది. స్లోవేనియాకు చెందిన ప్రముఖ రిఫరీ స్లావ్కో విన్సిచ్.. ఈ మహా సమరానికి ప్రధాన రిఫరీగా వ్యవహరించనున్నారు. ఆయనకు అసిస్టెంట్ రిఫరీలుగా టోమాజ్ క్లాంచినిక్, ఆండ్రాజ్ కోవాసిచ్ సహకారం అందించనుండగా, జోర్డాన్కు చెందిన అధామ్ మఖద్మే నాలుగో అఫీషియల్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
మ్యాచ్ ఎక్కడ చూడాలి..?
ఆదివారం అర్ధరాత్రి జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం జులై 20 (సోమవారం తెల్లవారుజామున) 12:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను భారత్‌లో Unit8 Sports 1, Unit8 Sports 1 HD, Unit8 Sports 2, Unit8 Sports 2 HD ఛానెళ్లలో చూడొచ్చు. డిజిటల్ వీక్షకులు ZEE5 యాప్, వెట్సైట్ మ్యాచ్‌ను లైవ్‌లో ఆస్వాదించవచ్చు.

