మద్యం తాగించి.. దొంగతనం ట్రైనింగ్

కలం, మిర్యాలగూడ: మద్యం తాగే అలవాటు ఉన్న యువకులను ఎంచుకుని.. వారికి దొంగతనాలు ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తున్న మోస్ట్ వాంటెడ్ అంతర్‌రాష్ట్ర నేరస్థుడు భూష్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు నేర సామ్రాజ్యాన్ని నల్లగొండ (Nalgonda) పోలీసులు ఛేదించారు. శ్రీకాంత్‌ను ఇటీవలే అరెస్ట్ చేయగా.. అతడు ఇచ్చిన సమాచారంతో ఎనిమిది మంది ముఠా సభ్యుల్లో ఆరుగురిని తాజాగా పట్టుకున్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

వైన్ షాపులే టార్గెట్..

విజయవాడ, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నల్లగొండ తదితర ప్రాంతాల్లో శ్రీకాంత్ తిరుగుతుండేవాడు. వైన్ షాపుల వద్ద ఉండే యువకులను టార్గెట్ చేసి, వారికి ఉచితంగా తాగపెడుతుండేవాడు. డబ్బులు ఖర్చు పెడుతూ, వారి వ్యక్తిగత సమస్యలను తీరుస్తున్నట్లుగా నమ్మించి మరింత దగ్గరయ్యేవాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే చోరీలే మార్గం అంటూ వారిని క్రమంగా నేరాల వైపు మళ్లించాడు.

ఇలా 9 మంది యువకులతో ముఠా తయారు చేసిన శ్రీకాంత్, వారికి దొంగతనాల్లో ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చేవాడు. తాళాలు ఎలా పగులగొట్టాలి? ఎలాంటి ఇళ్లను ఎంచుకోవాలి? రాత్రి వేళల్లో పోలీసుల కదలికలను ఎలా గమనించాలి? సీసీటీవీ కెమెరాల కంటికి చిక్కకుండా ఎలా తప్పించుకోవాలి? దొంగిలించిన సొత్తును ఎక్కడ అమ్మాలో నేర్పించేవాడు.

రాజమండ్రి జైలు నుంచే..

తొమ్మిది మంది ముఠాలో ఏ3గా ఉన్న తమ్మిశెట్టి నాగరాజు మినహా మిగిలిన వారికి ఎలాంటి నేరచరిత్ర లేదు. నాగరాజుపై ఏపీలో గతంలో పదికి పైగా కేసులు ఉండగా, ఓ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడే ఇతడికి భూష్మి శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి వచ్చాక ఇద్దరూ ఈ ముఠాను ఆపరేట్ చేశారు. మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఓ కేసు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఏపీలో అదుపులోకి..

సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు ఎం.జితేందర్ రెడ్డి, డి.చంద్రశేఖర్ రెడ్డి, మిర్యాలగూడ రూరల్ సీఐ పి.ఎన్.డి. ప్రసాద్, ఎస్సైలు ఆంజనేయులు, సురేశ్ యాదవ్ నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా పెట్టి, శనివారం ఏపీలోని పిడుగురాళ్ల, అంజనీపురం, మండేపూడి పరిసరాల్లో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి రూ.53 లక్షల విలువైన 260 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 కేజీల వెండి, రూ.1.50 లక్షల నగదుతో పాటు 5 బైకులు, రెండు టీవీలు, రెండు సౌండ్ బార్లు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 12 చోరీ ప్రాంతాల్లో సేకరించిన వేలిముద్రలు, సీసీటీవీ ఫుటేజీలు ఈ నిందితులవేనని శాస్త్రీయంగా నిర్ధారించారు. అప్పటికే ఈ ముఠాకు సంబంధించి తెలంగాణలో 28, ఆంధ్రాలో 12 కలిపి మొత్తం 40 చోరీల మిస్టరీని ఛేదించారు.

అధికారులకు అవార్డులు..

అత్యంత చాకచక్యంగా అంతర్‌రాష్ట్ర ముఠాను పట్టుకున్న సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు జితేందర్ రెడ్డి, చంద్రశేకర్ రెడ్డి, రూరల్ సీఐ ప్రసాద్, ఎస్సైలు విజయకుమార్, సురేశ్, హెడ్ కానిస్టేబుళ్లు విష్ణువర్ధనగిరి, పుష్పగిరి, నాగరాజు, వహీద్ పాషా, ఫయాజ్, కానిస్టేబుళ్లు శివరాజ్, నరేష్, గులాందస్తగిరి, కమల్ కిశోర్, సాయి, జునైద్, నాగరాణిలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించి, నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>