కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ఆడపిల్లల విద్యకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy ) తెలిపారు. శనివారం మహబూబ్ నగరంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో రూ.25 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత తరగతి గదులు సరిపోకపోవడంతో కొత్త గదుల నిర్మాణం చేపట్టుతున్నామని తెలిపారు.
ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత విద్యార్థులకు విశాలమైన, సౌకర్యవంతమైన తరగతి గదులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళాశాలలో నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ స్థాపనకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బీఎస్సీ కంప్యూటర్స్‌తో పాటు ఇతర కోర్సుల విద్యార్థులు కూడా కంప్యూటర్ పరిజ్ఞానం పొందేందుకు సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు.
అదనంగా టాస్క్ సెంటర్ ద్వారా విద్యార్థులు వివిధ భాషలు నేర్చుకునే అవకాశాలు కల్పిస్తున్నామని, స్వల్పకాలిక శిక్షణా కోర్సులు అందుబాటులో ఉన్నాయని యెన్నం (MLA Yennam) తెలిపారు. ముఖ్యంగా విద్యార్థినులు వీటిని ఎక్కువగా వినియోగించుకుంటున్నారని అన్నారు. పోలీస్ నియామకాల నేపథ్యంలో కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు సిద్ధం కావాలని విద్యార్థులను కోరారు. ఎన్‌సీసీ విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి రోజువారీగా సాధన చేయాలని సూచించారు.
మహిళా విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఎంతోమంది అమ్మాయిలు విద్యను కొనసాగించగలుగుతున్నారని ఎమ్మెల్యే యెన్నం తెలిపారు. అమ్మాయిలను చదివించడంలో వెనుకంజ వేయకుండా సమాన అవకాశాలు కల్పిస్తే వారు కుటుంబానికి, సమాజానికి ఆధారంగా నిలుస్తారని పేర్కొన్నారు. ఉచిత బస్సు పథకం విజయవంతమై అనేక మంది విద్యార్థినుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిందని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి కళాశాల గ్రంథాలయ అభివృద్ధికి తన సొంత నిధుల నుండి రూ.50 వేల చెక్కును ఎమ్మెల్యే సమక్షంలో అందజేశారు. ప్రతి సంవత్సరం రూ.50 వేల సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, హన్వాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వి.మహేందర్, కార్పొరేటర్లు ఉమర్ కొత్వాల్, ఫయాజ్, అవేజ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు అజ్మత్ అలి, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర నాయకుడు రమేష్ ముకుందం , మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామాంజులు రెడ్డి, ఇంచార్ ప్రిన్సిపాల్ అమీన ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: ఇండియాలో పేపర్ కరెన్సీకి చెక్! RBI కీలక అడుగు
Follow Us On : WhatsApp

