కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో నిరుద్యోగ యువత సమస్యలు, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలను ప్రధాన అజెండాగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ సరూర్నగర్ స్టేడియంలో ‘యువ సంగ్రామ సదస్సు’ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక బహిరంగ సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వచ్చాక 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని, ఒకవేళ వాళ్లు చెప్పిన మాటలు నిజమని నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచే తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు.
మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలంటూ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గతంలో రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగుల మధ్య ఏం మాట్లాడారో గుర్తుందా? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణలో నోటిఫికేషన్లు లేవని, కేవలం ‘లూటిఫికేషన్లు’ మాత్రమే జరుగుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది కొలువుల కుంభమేళా కాదని, అది కుంభకోణాల కుంభమేళా అని ధ్వజమెత్తారు. తమకు రావాల్సిన కొలువుల గురించి న్యాయంగా అడుగుతున్న యువతను, విద్యార్థులను ప్రభుత్వం పోలీసుల చేత దారుణంగా కొట్టిస్తోందని ఫైర్ అయ్యారు.

