కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా యువత భవిష్యత్తుకు భరోసానిస్తూ కొత్తగూడెంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) తెలిపారు. శుక్రవారం ఆయన ఈ వివరాలను వెల్లడిస్తూ, నియోజకవర్గంలో ఈ శిక్షణ కేంద్రం ఏర్పాటు కోసం ప్రభుత్వం జీవో నెంబర్ 398 ద్వారా మొదటి విడతగా రూ.10 కోట్ల నిధులను అధికారికంగా మంజూరు చేసిందని పేర్కొన్నారు.
తన నిరంతర కృషి వల్లనే ఈ కేంద్రం సాకారమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక కేంద్రాన్ని మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఎలాంటి పర్యవేక్షణ ఛార్జీలు లేకుండా ఈ నిర్మాణ పనులను రోడ్లు, భవనాల శాఖ ద్వారానే పూర్తి చేయించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఇందుకు సంబంధించిన నిధులను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కార్పస్ ఫండ్ నుండి భరిస్తారని స్పష్టం చేశారు.
ఈ శిక్షణ కేంద్రం అందుబాటులోకి వస్తే ఏడాదికి వెయ్యి మంది నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ రకాల వృత్తి నైపుణ్యాలలో శిక్షణ పొందే అద్భుతమైన అవకాశం లభిస్తుందని, ఇది స్థానిక యువతకు ఎంతో ఉపాధిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొత్తగూడెం (Kothagudem) నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో తోడ్పడే ఈ కేంద్రాన్ని మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Read Also: ప్రాణత్యాగానికైనా సిద్ధం.. మాజీమంత్రి సంచలన వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

