కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి (Bhadrachalam Temple) చెందిన వైదిక పోస్టుల నియామక ప్రక్రియ ముగిసింది. హైదరాబాద్లోని రవీంద్రభారతి వేదికగా శుక్రవారం నూతనంగా ఎంపికైన అర్హులైన మతపరమైన సిబ్బందికి మంత్రి కొండా సురేఖ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, అడిషనల్ కమిషనర్లు జ్యోతి, శ్రీనివాసరావు, భద్రాచలం దేవస్థానం ఈవో దామోదర్ రావులు పాల్గొని నూతన సిబ్బందికి తమ చేతుల మీదుగా ఉత్తర్వులను అందజేసి అభినందనలు తెలిపారు.
భద్రాద్రి రాముని సేవలో భాగస్వాములవుతున్న నూతన వైదిక సిబ్బంది ఆలయ సాంప్రదాయాలను గౌరవిస్తూ, అత్యంత భక్తిశ్రద్ధలతో విధులను నిర్వహించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. నియామక ప్రక్రియను అత్యంత నిష్పక్షపాతంగా నిర్వహించడం పట్ల అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

