కలం, మెదక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ (Kondapochamma Sagar) నింపాలని బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు (BRS Protest) దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి బ్యారేజీ నుంచి తక్షణమే నీటిని విడుదల చేసి, కొండ పోచమ్మ ప్రాజెక్టు నింపాలని నాయకులు డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కు కూతవేటు దూరంలో ఈ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ఉంటుందని చెప్పారు.
వర్షాలు సరిగా లేకపోవడంతో రైతన్నలు ఆందోళనకరంగా ఉన్నారని.. పంటలకు సాగు నీరు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నీటిని విడుదల చేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

