కలం, వెబ్ డెస్క్ : గల్ఫ్ ఆఫ్ ఒమాన్‌లోని వ్యూహాత్మక పోర్ట్ సిటీ చాబహార్‌పై అమెరికా గురువారం అర్ధరాత్రి మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఇరాన్‌లోని కీలక మౌలిక వసతులే లక్ష్యంగా సాగిన ఈ వైమానిక దాడుల్లో షాహిద్ బెహష్తీ పోర్టులోని మ్యారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ (Chabahar Port Tower) కుప్పకూలిపోయింది.
సముద్ర రవాణాను పర్యవేక్షించే ఈ మారిటైమ్ వాచ్ టవర్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు మూడుసార్లు బాంబు దాడులు చేశాయని, దీంతో అది పూర్తిగా ధ్వంసమైందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెట్ అధికారికంగా ధృవీకరించారు. అమెరికా జరిపిన ఈ భారీ దాడుల కారణంగా చాబహార్ నగరం మొత్తం భారీ పేలుళ్ల శబ్దాలతో వణికిపోయింది. ఇరాన్ రక్షణ శాఖ అధికారులు సైతం ఈ దాడులు జరిగిన విషయాన్ని ధృవీకరించారు.
ఈ దాడుల ప్రభావం చాబహార్ పోర్టుకే పరిమితం కాకుండా ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని పలు దీవులు, నగరాలపై కూడా తీవ్రంగా పడింది. అమెరికా సైన్యం అక్కడ పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. హార్మూజ్ ప్రావిన్స్‌లోని ప్రధాన రోడ్డు, రైల్వే నెట్‌వర్క్‌లతో పాటు ఇరాన్‌షహర్‌లోని విమానాశ్రయంపై కూడా దాడులు జరిగాయి. ఈ దెబ్బకు ఆయా ప్రాంతాల్లోని ప్రధాన రవాణా మార్గాలన్నింటినీ అధికారులు మూసివేశారు. ఇరాన్ దేశానికి ఉన్న ఏకైక డీప్ వాటర్ పోర్టు ఇదే కావడం, ఇది నేరుగా హిందూ మహాసముద్రంతో అనుసంధానమై ఉండటంతో ఇరాన్‌కు ఇది కోలుకోలేని దెబ్బగా మారింది.
వాణిజ్యపరంగానే కాకుండా, సైనిక వ్యూహాల పరంగా కూడా చాబహార్ పోర్టు ప్రపంచ దేశాలకు అత్యంత కీలకం. ముఖ్యంగా భారత్ నుంచి ఆఫ్ఘనిస్థాన్, మిడిల్ ఈస్ట్, మధ్య ఆసియా దేశాలకు రవాణా సాగించడానికి ఈ పోర్ట్ మార్గమే ప్రధాన ఆధారం. ఇప్పుడు అమెరికా చేసిన ఈ మెరుపు దాడుల వల్ల అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు పెద్ద ఆటంకం ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది.

