కలం, వెబ్ డెస్క్ : భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు (Hydrogen Train) పట్టాలెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఈ చారిత్రాత్మక రైలును అధికారికంగా ప్రారంభించారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుండి బయల్దేరిన ఈ హైడ్రోజన్ రైలు, ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపత్ సెక్షన్‌లో దాదాపు 89 కిలోమీటర్ల మేర ప్రయాణించనుంది. ‘నమో గ్రీన్ రైల్’ (Namo Green Rail) గా పిలవబడే ఈ రైలును ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలుగా అభివర్ణిస్తున్నారు.
పర్యావరణ హిత సాంకేతికతతో రూపొందించిన ఈ రైలులో 10 కోచ్‌లు ఉన్నాయి. ఇందులో ‘ప్రొటాన్ ఎక్స్‌ఛేంజ్ మెంబ్రేన్ ఫ్యూయెల్ సెల్’ అనే చిన్నపాటి అత్యాధునిక పవర్‌ప్లాంట్‌ను అమర్చారు. దీని ప్రొపల్షన్ వ్యవస్థ సామర్థ్యం 3,200 HP కావడం విశేషం. ప్రయాణికుల సౌకర్యార్థం, భద్రత కోసం ఈ రైలులో నాన్‌స్టాప్ వెంటిలేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. దేశీయంగా గ్రీన్ ఎనర్జీ రంగాన్ని బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్ట్ కీలక మైలురాయిగా నిలవనుంది.

