కలం, దమ్మ పేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట (Dammapeta) మండలం అప్పారావుపేటలోని ఓ పామాయిల్ ఫ్యాక్టరీలో(Palm Oil Factory) గురువారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలోని బాయిలింగ్ ఛాంబర్ పరిధిలో ఉన్న హాట్ వాటర్ పైప్‌లైన్‌లో నీరు జామ్ కావడంతో ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. దీంతో వాటర్ వ్యూ గ్లాస్ పగిలిపోవడంతో దాదాపు 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన మరుగుతున్న వేడి నీరు బయటకు ఎగిసిపడింది.
ఈ ఘటనలో అక్కడ విధులు నిర్వహిస్తున్న గణేష్, శివరామ్ అనే ఇద్దరు కార్మికులపై వేడి నీరు పడటంతో వారి శరీరాలు తీవ్రంగా కాలిపోయాయి. ప్రమాదాన్ని గమనించిన తోటి సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను సత్తుపల్లిలోని శ్రీనిధి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం బాధితులను విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ అత్యవసర చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనతో ఫ్యాక్టరీలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

