గోదావరి జలాలే లక్ష్యం.. సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం: భట్టి

కలం, ఖమ్మం బ్యూరో: గోదావరి నది జలాలను గ్రావిటీ, లిఫ్ట్ ద్వారా గరిష్టంగా వినియోగంలోకి తీసుకురావాలనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వం ప్రత్యేక నజర్ పెట్టిందని, ఇందులో భాగంగానే నెలవారీ క్యాలెండర్ ఏర్పాటు చేసుకొని ‘సీతారామ’ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి (Deputy CM) భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతిపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

అంతర్జాతీయ వాతావరణ మార్పులను తట్టుకునేలా ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, మూడు రోజుల క్రితమే దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 12 జిల్లాల్లోని 22 రిజర్వాయర్లను నింపే కార్యక్రమాన్ని పర్యవేక్షించామని తెలిపారు. ఇదే వ్యూహంతో సీతారామ ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

​గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం రూ.3,505 కోట్ల అంచనా వ్యయంతో 4 లక్షల ఎకరాలకు నీరందించేలా రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. రాష్ట్ర విభజనకు ముందే అందుకోసం దాదాపు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేశామని, కేవలం రూ.1,505 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే ఈ ప్రాజెక్టులను గత కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనతో రీడిజైన్ చేసిందని మండిపడ్డారు.

ఈ రీడిజైనింగ్ కారణంగా ప్రాజెక్టు వ్యయం ఏకంగా రూ. 24 వేల కోట్లకు పెరిగిందని, తద్వారా రూ. 7,500 నుండి రూ. 8,000 కోట్లు అదనపు భారం పడిందని, నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌గా తాను సభలోనూ, బయటా ఈ దోపిడీని ఎండగట్టామని చెప్పారు. ​గత ప్రభుత్వం చేసిన తప్పులను గమనించే ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేబినెట్‌లో చర్చించి, ఇప్పటికే ప్రజల సొమ్ము భారీగా ఖర్చు చేసినందున ఈ ప్రాజెక్టును ఆపకుండా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క వివరించారు.

ఇందులో భాగంగా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ లోపాలను సరిదిద్దుతూ, సాగర్ కెనాల్‌తో రాజీవ్ కెనాల్‌ను అనుసంధానిస్తున్నామని తెలిపారు. లింక్ కెనాల్స్, టన్నెల్స్ ద్వారా వైరా, పాలేరు రిజర్వాయర్లను నింపుతూ సత్తుపల్లి వరకు నీళ్లు తీసుకెళ్లేలా పనులను వేగవంతం చేస్తున్నామని అన్నారు. ఏ ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా పనులు పూర్తి చేసి, జిల్లా రైతాంగం అనాదిగా పెట్టుకున్న ఆశలను ఈ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని ఉప ముఖ్యమంత్రి విస్పష్టంగా ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>