కలం, నారాయణపేట: గ్రామీణాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి సమగ్ర సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో నాబార్డ్ ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషిస్తూ దేశ అభివృద్ధికి అండగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక (Narayanpet Collector Priyanka) అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రీఫైనాన్సింగ్, రైతులకు ఆర్థిక సహాయం, మహిళా సంఘాలకు ఫైనాన్షియల్ సపోర్ట్, నేచురల్ ఫార్మింగ్ ప్రోత్సాహం వంటి అనేక రంగాల్లో నాబార్డ్ ఎంతో విశేషమైన సేవలు అందిస్తోందన్నారు. నా బార్డ్ డే సందర్భంగా గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద గల వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో కూడా నాబార్డ్ ఇటీవల తన కార్యకలాపాలను మరింత విస్తరించడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. గ్రామీణ జిల్లా అభివృద్ధికి నాబార్డ్ వంటి సంస్థలు చేరువ కావడం ఎంతో అవసరం అని తెలిపారు. స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులు నాబార్డ్ అందిస్తున్న అభివృద్ధి అవకాశాలు, పథకాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుని తమ జీవనోపాధిని మరింత మెరుగుపరచుకోవాలని ఆమె సూచించారు.
45 ఏళ్లుగా నాబార్డ్ సేవలు..
దేశంలో ఎన్నో ఆర్థిక సంస్థలు ఉన్నప్పటికీ, గత 45 సంవత్సరాలుగా గ్రామీణ ప్రజలకు నమ్మకమైన భాగస్వామిగా నాబార్డ్ సేవలందిస్తోందన్నారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన ఏ సమావేశం జరిగినా, జిల్లా కలెక్టర్ పిలుపు వచ్చిన వెంటనే స్పందిస్తూ, “మేము సిద్ధంగా ఉన్నాం.. అవసరమైతే డీపీఆర్‌లు తయారు చేస్తాం. మా వద్ద నిధులు ఉన్నాయి. జిల్లాకు అవసరమైన సహకారం అందిస్తాం” అనే సానుకూల దృక్పథంతో నాబార్డ్ అధికారులు ఎప్పుడూ ముందుంటున్నారని ఆమె పేర్కొన్నారు.
భవిష్యత్తులో కూడా ఈ సహకారం మరింత బలపడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా జిల్లా మహిళలకు నాబార్డ్ సంస్థలు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రజలు కూడా ముందుకు రావాలని సూచించారు. మనం ఏం చేయగలం? మన గ్రామాల్లో ఏ అవకాశాలు ఉన్నాయి? ఏ వ్యాపారాలు ప్రారంభించవచ్చు? అనే విషయాల్లో ధైర్యంగా ముందుకు రావాలని మహిళా సంఘాల సభ్యులకు ఆమె సూచించారు.
రుణాలతో వ్యాపారం విస్తరించాలి..
మహిళా సంఘాలతో నిరంతరం అనుసంధానంగా ఉండాలని, రుణం తీసుకోవడమే కాకుండా ఆ రుణాన్ని సరైన విధంగా ఉపయోగించి మరింత ఆదాయం వచ్చేలా వ్యాపారాన్ని విస్తరించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సబ్సిడీలు, ఇతర అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నా బార్డ్ అందించబోయే ప్రెజెంటేషన్‌లో కూడా ఈ అంశాల గురించి వివరంగా తెలియజేస్తారని, అందరూ శ్రద్ధగా విని ఎలాంటి సహాయం అవసరమైనా నాబార్డ్ సంస్థ ద్వారా, అలాగే సంబంధిత ప్రభుత్వ శాఖల ద్వారా తాము ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటామని కలెక్టర్ భరోసా ఇచ్చారు.
ఆదర్శ జిల్లాగా నారాయణ పేట..
తెలంగాణ ప్రభుత్వం “కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలి” అనే లక్ష్యంతో పనిచేస్తోందని, అలాగే నారాయణపేటను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని కలెక్టర్ తెలిపారు. ఆ మహత్తర లక్ష్య సాధనలో నాబార్డ్ తన సహకారం, మార్గదర్శకత్వాన్ని మరింతగా అందించాలన్నారు. ఆ లక్ష్య సాధనలో అందరూ భాగస్వాములు కావాలని రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో, చురుకుదనంతో ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం స్వయం సహాయక సంఘాల బలోపేతం మహిళా పారిశ్రామిక వేత్తల అభివృద్ధి విజయ గాథల గురించి ట్రైనీ శ్రీనివాస్ వివరించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీవో వెంకట్ రాములు, నాబార్డు డీడీ మహేందర్ బాబు, ఎల్డీఎం విజయ్ కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ రామలింగేశ్వర గౌడ్, ఉద్యాన శాఖ జిల్లా అధికారి సాయిబాబా, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి, కార్యదర్శి పద్మమ్మ, కోశాధికారి అంజమ్మ, మున్సిపల్ కమిషనర్ శంకర్, డీపీఎంలు, ఏపీఎంలు, తదితరులు పాల్గొన్నారు.

