కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి విద్యార్థినికి హోమ్‌వర్క్ రూపంలో ఇస్లామిక్ ప్రార్థనలైన కల్మా, సూరహ్ ఫాతిహా రాయాలని సూచించడం తీవ్ర వివాదానికి దారితీసింది. పాతబస్తీ పరిధిలోని సక్సెస్ స్కూల్ (Saidabad Success School)లో సెకండ్ క్లాస్ చదువుతున్న ఒక హిందూ విద్యార్థినితో యాజమాన్యం కల్మా చదివించి, రాయించిందంటూ సదరు బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా విద్యార్థి హోమ్‌వర్క్ డైరీలో కల్మా, సూరహ్ ఫాతిహా రాయాలని, పఠించాలని సూచించినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు.
ఈ విషయం వెలుగులోకి రాగానే విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. హిందూ విద్యార్థులపై ఇలాంటి మతపరమైన అంశాలను రుద్దడం సరికాదని, బాధ్యులైన పాఠశాల యాజమాన్యంపై ప్రభుత్వం, విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ (Raja Singh) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చిన్నారిపై మతపరమైన ఒత్తిడి తీసుకురావడం ఘోరమైన ఉదంతమని ఆయన అభివర్ణించారు. పాఠశాల బాధ్యులపై తక్షణమే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో ఇలాంటి ప్రవృత్తిని సహించేది లేదని, విద్యార్థుల తల్లిదండ్రులకు తాము అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదంతో సైదాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. అయితే విషయం తమ దృష్టికి రాగానే ఆ టీచర్ ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు పాఠశాల (Saidabad Success School) యాజమాన్యం పేర్కొంది. ఇది టీచర్ చేసిన పొరపాటుగా తాము బావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
Read Also: దశాబ్దాల కలకు టేకాఫ్.. ఉత్తర తెలంగాణకు ఆకాశమే హద్దు!
Follow Us On : WhatsApp

