ఆటోపై నినాదాల వివాదం.. బాధితుడికి బండి సంజయ్ భరోసా

కలం, కరీంనగర్ : ఆటో పై హిందూత్వ నినాదం రాయించుకున్న ఆటో డ్రైవర్ ను కొందరు బండ బూతులు తిడుతూ ఆటో కవర్ ను చించేయడమే కాకుండా పోలీసు అండతో భయభ్రాంతులకు గురిచేసిన సంఘటన హైదరాబాద్ లోని మెహిదీపట్నంలో ఆలస్యంగా వెలుగు చేసింది. ఈ వివాదంలో బాధితుడికి కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) భరోసాగా నిలిచారు.

బాధితుడి వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లాకు చెందిన చంచరి భరత్ కుమార్(24) పొట్టకూటి కోసం హైదరాబాద్ కు వచ్చి ఆటో నడుపుతున్నాడు. భరత్ హిందుత్వ వాది కావడంతో ఆటో వెనుక కవర్ పై ‘‘Changing your religion is like your father (నీ మతాన్ని మార్చుకోవడం అంటే నీ తండ్రిని మార్చుకోవడం లాంటిది), Anyone born on this earth is a hindu… jai Sriram (ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువులే… జై శ్రీరామ్) అని నినాదాన్ని రాయించుకున్నారు.

అయితే, ఈనెల 13న భరత్ ప్యాసింజర్ ను ఎక్కించుకుని మెహిదీపట్నం నుండి జీడిమెట్లకు వెళుతుండగా మజ్లిస్ పార్టీకి చెందిన నలుగురు యువకులు ఆటోను వెంబడించారు. బలవంతంగా భరత్ ను ఆటో నుండి దింపి ‘ఆటో వెనుక ఏం రాసినవ్ రా… ఏమనుకుంటున్నవ్ రా…ఆ స్లోగన్స్ తీసేస్తావా? లేదా?’’ అంటూ బండ బూతులు తిట్టి ఆటో కవర్ చించి వేశారు. మళ్లీ అలాంటి నినాదాలు రాస్తే… హైదరాబాద్ లో ఆటో కూడా తిరగనీయబోమని, చంపేస్తామని భయభ్రాంతులకు గురి చేశారు.

మళ్లీ కాసేపటికే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. ‘‘నేను అత్తాపూర్ ఎస్ఐని(పేరు శ్రీనివాసులు) మాట్లాడుతున్నా. ఆటోమీద అట్లాంటి స్లోగన్స్ ఎట్లా రాస్తావ్? హైదరాబాద్ లో ఆటో తిరగాలని ఉందా? లేదా? వెంటనే స్టేషన్ కు రా. నీమీద కంప్లయింట్ వచ్చింది. రాకపోతే నీ ఆటోను సీజ్ చేస్తా’’అంటూ బెదిరించారు.

దీంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయిన భరత్ కు అక్కడున్న కొందరు హిందుత్వ వాదుల వద్దకు తీసుకెళ్లారు. విషయం విన్న వాళ్లు భరత్ కు అండగా నిలిచారు. అత్తాపూర్ పీఎస్ కు తీసుకెళ్లి స్థానిక సీఐకి జరిగిందంతా వివరించారు. ఎస్ఐ శ్రీనివాసులుపై చర్య తీసుకోవడంతోపాటు భరత్ ను బెదరించి ఆటో ను డ్యామేజ్ చేసిన మజ్లిస్ నాయకులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫిర్యాదు ఇచ్చారు.

అలాగే భరత్ ను వెంట బెట్టుకుని బుధవారం కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి వచ్చి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిశారు. జరిగిన విషయాన్ని వివరిస్తూ బాధితుడు భరత్ ఫోటోలు, వీడియోలు చూపించారు. భరత్ కు అండగా ఉంటానని ఈ సందర్భంగా బండి సంజయ్ భరోసానిచ్చారు. హిందూత్వ సిద్దాంతాన్ని నమ్మి ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు అభినందించారు.

ఆటో కవర్ డ్యామేజ్ అయిందని భరత్ చెప్పడంతో పాత ఆటో స్థానంలో కొత్త ఆటో తీసుకోవాలని, అందుకయ్యే ఖర్చును తాను చెల్లిస్తానని హామీ ఇవ్వడంతోపాటు వెంటనే కొత్త ఆటో కొనుక్కునేందుకు డబ్బు ఇవ్వాలని అక్కడే ఉన్న సిబ్బందిని ఆదేశించారు. భరత్ ను వేధించిన మజ్లిస్ నాయకులపై చర్యలు తీసుకునే అంశంపై హైదరాబాద్ సీపీతో మాట్లాడతానని బండి హామీ సంజయ్ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>