నూతన నర్సింగ్ అధికారులకు శిక్షణ విజయవంతం: DME

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నియమించిన 2026 బ్యాచ్ కు చెందిన నర్సింగ్ అధికారులకు రాష్ట్రస్థాయి ద్వితీయ విడత ఇండక్షన్ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (Telangana DME) తెలిపింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆడిటోరియంలో ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు విజయవంతంగా నిర్వహించినట్లు వివరించింది. ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, నాణ్యమైన మానవ వనరులను అభివృద్ధి చేయడం, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడం, నిరంతర సామర్థ్యాభివృద్ధికి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది.

నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా..

ప్రభుత్వ వైద్య సంస్థల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించగల నైపుణ్యం, నైతిక విలువలు, రోగి కేంద్రిత సేవాభావం కలిగిన నర్సింగ్ సిబ్బందిని తీర్చిదిద్దే దిశగా ఈ కార్యక్రమం మరో కీలక మైలురాయిగా నిలిచిందని అభిప్రాయపడింది. ఈ ఒకరోజు శిక్షణలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ పనితీరు, నర్సింగ్ అధికారుల బాధ్యతలు, ప్రభుత్వ సేవా నియమాలు, పరిపాలనా విధానాలు, నర్సింగ్ నైతిక విలువలు, చట్టపరమైన బాధ్యతలు, ఇన్ఫెక్షన్ నివారణ మరియు నియంత్రణ, రోగి భద్రత, అత్యవసర పరిస్థితుల నిర్వహణ, సమర్థవంతమైన కమ్యూనికేషన్, సాక్ష్యాధార ఆధారిత నర్సింగ్ సేవలు వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించినట్లు తెలిపింది.

ట్రైనింగ్ ను ప్రారంభించిన డా. నరేందర్

ఈ కార్యక్రమాన్ని వైద్య విద్యా సంచాలకులు డా. నరేందర్ కుమార్ ప్రారంభించి, నూతనంగా ప్రభుత్వ సేవలో చేరిన నర్సింగ్ అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా డా. నరేందర్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 10,000 మంది నర్సింగ్ అధికారులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించడం ద్వారా రాష్ట్ర ఆరోగ్య రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించిందని అన్నారు. ఇది తెలంగాణ ఆరోగ్యశాఖ చరిత్రలో అత్యంత విశిష్టమైన నియామకాలలో ఒకటిగా నిలిచిందన్నారు. నైపుణ్యం కలిగిన నర్సింగ్ సిబ్బందిపై పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని పేర్కొన్నారు.

డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (Telangana DME) చరిత్రలో తొలిసారిగా నూతనంగా నియమితులైన నర్సింగ్ అధికారుల కోసం ప్రత్యేక రాష్ట్రస్థాయి ఇండక్షన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. దీనివల్ల వారు ప్రభుత్వ సేవా విధానాలు, వృత్తిపరమైన బాధ్యతలు, నైతిక విలువలు, నాణ్యమైన రోగి సంరక్షణపై స్పష్టమైన అవగాహనతో తమ సేవలను ప్రారంభించగలరన్నారు.

నర్సింగ్ అధికారులు ప్రతి ఆసుపత్రికి వెన్నెముకలాంటివారని, రోగులతో అత్యధిక సమయం గడిపే ఆరోగ్య సేవా సిబ్బంది వారేనని పేర్కొన్నారు. వైద్యులు వ్యాధిని నిర్ధారించి చికిత్స సూచిస్తే, నర్సింగ్ అధికారులు రోగుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడం, మందులు అందించడం, బెడ్‌సైడ్ కేర్, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం, సమస్యలను నివారించడం, మానసిక ధైర్యం కల్పించడం వంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తారని తెలిపారు.

నర్సింగ్ కేవలం ఉద్యోగం కాదు..

నర్సింగ్ అనేది కేవలం ఉద్యోగం కాదని, మానవ సేవకు అంకితమైన గొప్ప వృత్తి అని పేర్కొన్నారు. కరుణ, నిజాయితీ, క్రమశిక్షణ, వినయం, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. సమాజంలోని పేద, బలహీన వర్గాలకు సేవ చేయడం ఒక గొప్ప అవకాశమని అన్నారు. రోగులతో మర్యాదపూర్వకంగా మాట్లాడడం, చిరునవ్వుతో పలకరించడం, సహానుభూతితో వ్యవహరించడం రోగుల ఆందోళనను తగ్గించి వారి కోలుకునే ప్రక్రియను వేగవంతం చేస్తుందని వివరించారు. ప్రతి రోగిని వారి సామాజిక లేదా ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా గౌరవంతో చూడాలని సూచించారు.

నూతన నర్సింగ్ అధికారులు రోగులు, వారి కుటుంబ సభ్యులతో సమర్థవంతమైన కమ్యూనికేషన్ కొనసాగించాలని, వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందితో సమన్వయంగా పనిచేయాలని, క్లినికల్ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలని, నిరంతరం తమ జ్ఞానం, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, సీనియర్‌ల అనుభవాన్ని నేర్చుకుంటూ ఆదర్శ నర్సింగ్ అధికారులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

డీఎంఈ (అకాడెమిక్) డా. రామాదేవి మాట్లాడుతూ.. ఓర్పు, వినయం, క్రమశిక్షణ, నైతిక విలువలు, మర్యాదపూర్వక సంభాషణ ఒక ఉత్తమ నర్సింగ్ అధికారికి ముఖ్య లక్షణాలని పేర్కొన్నారు. రోగి కేంద్రిత సేవలు అందిస్తూ, అన్ని పరిస్థితుల్లో వృత్తి నైపుణ్యాన్ని కాపాడాలని, నిరంతర విద్య ద్వారా క్లినికల్ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

సహాయ సంచాలకురాలు (నర్సింగ్) విజయ నిర్మల.. నూతన నర్సింగ్ అధికారులను అభినందిస్తూ, ఈ రాష్ట్రస్థాయి ఇండక్షన్ కార్యక్రమాన్ని తెలంగాణ నర్సింగ్ చరిత్రలో ఒక చారిత్రాత్మక కార్యక్రమంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమానికి అనుమతి, సహకారం అందించిన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రెండు నుంచి మూడు దశాబ్దాలపాటు తెలంగాణ ప్రజలకు సేవలందించే బాధ్యత నూతన నర్సింగ్ అధికారులపై ఉందని చెప్పారు. అందుకే ప్రభుత్వ సేవా నియమాలు, పరిపాలనా విధానాలు, వృత్తి నైతిక విలువలు, చట్టపరమైన బాధ్యతలు, ఇన్ఫెక్షన్ నియంత్రణ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, అత్యవసర సేవలు, డాక్యుమెంటేషన్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, రోగి భద్రత, నాణ్యత ప్రమాణాలపై ఈ శిక్షణను రూపొందించినట్లు తెలిపారు.

సమగ్ర విద్యా, సాంకేతిక శిక్షణా సెషన్లు: ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ అధ్యాపకులు, నిపుణులు శిక్షణ అందించారు.

ప్రొఫెసర్ డా. అలిమేలు – నవజాత శిశు సంరక్షణ (Essential Newborn Care)

విజయ భాస్కర్, సీనియర్ ఆఫీస్ సూపరింటెండెంట్ – ప్రభుత్వ సేవా నియమాలు, సెలవు నిబంధనలు, CCA నియమాలు, ప్రవర్తనా నియమాలు, పరిపాలనా విధానాలు

AIIMS బీబీనగర్ – ECHO ప్రాజెక్ట్ బృందం – నర్సింగ్ అధికారుల సామర్థ్యాభివృద్ధి, ఆసుపత్రి ఇన్ఫెక్షన్ నియంత్రణ, యాంటీమైక్రోబియల్ స్టీవార్డ్‌షిప్

సెయింట్ జాన్ అంబులెన్స్ సర్వీసెస్ బృందం – CPR, Basic Life Support (BLS), అత్యవసర పరిస్థితుల నిర్వహణ

కె. హరిత – నాణ్యత హామీ (Quality Assurance), NABH ప్రమాణాలు, రోగి భద్రత

 నరేంద్ర రాజన్ – వృత్తి నైపుణ్యం, నైతిక ప్రవర్తన, నాయకత్వం, జట్టు భావన, ఒత్తిడి నిర్వహణ

బి. దీపిక – సురక్షిత క్లినికల్ సేవలు, హ్యాండోవర్, డాక్యుమెంటేషన్, మందుల భద్రత

జి. ప్రవళిక – ఇన్ఫెక్షన్ నివారణ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, వృత్తి భద్రత

కె. అనూరాధ – నర్సింగ్ డాక్యుమెంటేషన్, మెడికో-లీగల్ బాధ్యతలు, రికార్డు నిర్వహణ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు

అదనంగా ప్రభుత్వ ఆసుపత్రుల పరిపాలనా వ్యవస్థ, క్లినికల్ గవర్నెన్స్, నర్సింగ్ నైతిక విలువలు, రోగి కేంద్రిత సేవలు, నాణ్యతాభివృద్ధి కార్యక్రమాలు, అత్యవసర నిర్వహణ, ప్రజారోగ్య బాధ్యతలు, నిరంతర నర్సింగ్ విద్య వంటి అంశాలపై కూడా శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేస్ స్టడీలు, ప్రాక్టికల్ డెమోన్స్ట్రేషన్లు, ఇంటరాక్టివ్ చర్చలు, ప్రశ్నోత్తర కార్యక్రమాలు నిర్వహించగా, పాల్గొన్న నర్సింగ్ అధికారులు తమ సందేహాలను నివృత్తి చేసుకుని ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థపై మరింత అవగాహన పొందారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ వైద్య సంస్థలకు చెందిన సుమారు 150 మంది నూతన నర్సింగ్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రస్థాయి ఇండక్షన్ కార్యక్రమాన్ని నర్సింగ్ అధికారులు ఆర్.లక్ష్మణ్, ఎం.కొండల్, రమణాయుడు, బి.కృష్ణ సమర్థవంతంగా సమన్వయం చేసి విజయవంతంగా నిర్వహించారు.

Read Also: పాద‌యాత్ర‌పై కేటీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>