వైద్య సేవలు బలోపేతం చేయండి.. మంత్రికి ఎమ్మెల్యే పాయం వినతి

కలం, ఖమ్మం బ్యూరో : గిరిజన, అటవీ, పారిశ్రామిక ప్రాంతాలతో కూడిన పినపాక నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసి, పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యాన్ని అందించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (MLA Payam Venkateswarlu) మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. బుధవారం హైదరాబాద్‌లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే, నియోజకవర్గ పరిధిలోని ఆరోగ్య రంగ సమస్యలు, ఆసుపత్రుల బలోపేతానికి అవసరమైన నిధులు, సిబ్బంది భర్తీపై సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించారు. ​

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలో వేలాది మంది గిరిజన, గ్రామీణ ప్రజలు వైద్యం కోసం పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఆధారపడుతున్నారని వివరించారు. అయితే ప్రస్తుతం ఉన్న వైద్యులు, స్పెషలిస్టులు, పారామెడికల్ సిబ్బంది కొరతతో పాటు మౌలిక వసతుల లేమి వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

​మణుగూరు 100 పడకల ఏరియా ఆసుపత్రి, బూర్గంపాడు సీహెచ్‌సీతో పాటు మణుగూరు, గుండాల, కరకగూడెం, మొరంపల్లి బంజర, ఆళ్లపల్లి, జానంపేట పీహెచ్‌సీల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను అత్యవసరంగా భర్తీ చేయాలని కోరారు. ఆసుపత్రుల్లో ఐసీయూ, చిన్నారుల వార్డులు, అదనపు పడకలు, ఓపీ షెడ్లు, సబ్ సెంటర్ల భవనాలు, కాంపౌండ్ వాల్స్ నిర్మించడంతో పాటు అంబులెన్స్, మార్చురీ వాహనాలను సమకూర్చాలన్నారు.

అలాగే పెండింగ్ హెచ్‌డీఎస్ నిధులను విడుదల చేసి, అవసరమైన చోట పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేయాలని విన్నవించారు. ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహ, నియోజకవర్గ ఆసుపత్రుల బలోపేతానికి, గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సాధ్యమైనంత త్వరగా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>