కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు గుండె చప్పుడు, దాదాపు 80 వేల మంది కార్మికుల భవిష్యత్తును శాసించే సింగరేణి బొగ్గు బెల్ట్ ఇప్పుడు కేవలం బొగ్గును మాత్రమే కాదు.. రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల పొలిటికల్ సెగలను రగిలిస్తోంది. డిసెంబర్ 2023లో జరిగిన ఏడో సింగరేణి ఎన్నికల (Singareni Elections) తీర్పు ఒక విచిత్రమైన మైండ్ గేమ్‌ను తలపించింది. 11 డివిజన్లలో ఆరు చోట్ల గెలిచి కాంగ్రెస్ (INTUC) సీట్ల పరంగా పైచేయి సాధిస్తే, ఐదు స్థానాల్లో గెలిచినా ఓట్ల మెజార్టీతో సీపీఐ (AITUC) సింగరేణి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఒక్క సీటూ దక్కక బీజేపీ (BMS) చతికిలపడితే, గులాబీ జెండా వెనుకబడింది. కానీ, ఆ పాత లెక్కలు ఇప్పుడు మారాయి! తాజా పరిణామాలు, పొలిటికల్ యాత్రలతో సింగరేణి గనులు ఇప్పుడు ఓ హై-వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి.
సెంటిమెంట్ రగిల్చిన కవిత
ఈ రణరంగంలో మొదటి ట్విస్ట్ ఇస్తూ క్షేత్రస్థాయిలో కార్మికుల గుండెల్లో ‘బాయిబాట’ సెంటిమెంట్‌ను రగిల్చారు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. పోయిన వైభవాన్ని ఎలాగైనా తెచ్చుకోవాలన్న కసితో, ఆమె ప్రతిష్టాత్మక “సింగరేణి బాయిబాట” పర్యటనకు శ్రీకారం చుట్టారు. మొదటి దఫా ఆరు రోజుల పాటు ఐదు కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమె పర్యటన అక్షరాలా ఒక ప్రభంజనంలా సాగింది. రెండో దఫా 4 నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ అధినేత్రి పర్యటన రణరంగాన్ని తలపించింది. మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం, మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం మణుగూరు, సత్తుపల్లి గనుల్లోకి ఆమె నేరుగా దిగిపోయారు. నల్లటి బొగ్గు ధూళి మధ్య, చెమట చిందించే కార్మికులతో ముఖాముఖి కూర్చుని, వారి కష్టాలను, నివాస ప్రాంతాల్లోని మౌలిక వసతుల లేమిని గుండెలకు హత్తుకున్నారు. “మేము అధికారంలో ఉన్నా లేకపోయినా… మీ ‘బొగ్గు బాయి’ కష్టాల్లో తోడుండేది మేమే” అంటూ కార్మికులలో సెంటిమెంట్‌ను బలంగా రగిలించారు.
బీజేపీ సింగరేణి భరోసా యాత్ర
కవిత యాత్ర ముగిసిందో లేదో… కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అంతకంటే పెద్ద వ్యూహంతో ‘భరోసా’ పాలిటిక్స్‌ను తెరపైకి తెచ్చింది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుల నేతృత్వంలో “సింగరేణి భరోసా యాత్ర” పేరుతో ఏకంగా 1,200 కిలోమీటర్ల సుదీర్ఘ పొలిటికల్ రైడ్ చేశారు. కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లి, గోదావరిఖని, మంచిర్యాల ప్రాంతాలను చుట్టేస్తూ బీజేపీ ఒక బ్రహ్మాస్త్రాన్ని సంధించింది. “చట్టప్రకారం వేలం వేయాల్సిన ‘తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్’ను ప్రధానమంత్రి ప్రత్యేక అధికారంతో, కిషన్ రెడ్డి చొరవతో వేలం లేకుండా నేరుగా సింగరేణికే ఇచ్చాం! దీనివల్ల మరో 40 ఏళ్ల పాటు మీ ఉద్యోగాలకు ఢోకా లేదు” అంటూ క్రెడిట్ మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు, రూ. 1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయం వివాదాన్ని లేవనెత్తి కాంగ్రెస్ వైఫల్యాన్ని కార్మికుల్లో చర్చకు పెట్టారు. 40 వేల శాశ్వత ఉద్యోగులతో పాటు, 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు తామే ‘భరోసా’ అని చాటిచెప్పారు. దీంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ రీయింబర్స్ చేస్తామంటూ అనేక హామీలను గుప్పించారు.
మరి ఈ దెబ్బకు అధికార కాంగ్రెస్ ఊరుకుంటుందా? ఇక్కడే ‘తాడిచర్ల’ క్రెడిట్ వర్సెస్ లీజుల రాజకీయం మొదలైంది. డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తన పరిపాలనా అధికారంతో దీనికి బలమైన రిటార్ట్ ఇచ్చారు. “కేంద్రం బ్లాక్ ఇస్తే సరిపోతుందా? మేము నిరంతరం ఒత్తిడి తెచ్చి ‘తాడిచర్ల-2’ మైనింగ్ లీజు అనుమతులు సాధించబట్టే కదా ఈరోజు 3,000 మందికి ఉద్యోగాలొస్తున్నాయి” అంటూ కౌంటర్ ఇచ్చారు. గోదావరి బేసిన్ లోని ఇతర బ్లాకులను ప్రైవేట్ పరం చేయనివ్వకుండా సింగరేణికే ఇవ్వాలని కేంద్రంతో పోరాడుతున్న రథసారథిని తానేనని స్పష్టం చేశారు. కార్మికులతో పాటు సంస్థను నడిపించే 2,200 మంది అధికారుల పే-రివిజన్, పీఆర్పీ సమస్యలను కోల్ ఇండియా తరహాలో పరిష్కరించాలని మేనేజ్మెంట్కు డెడ్‌లైన్ విధించి, సింగరేణి బ్రెయిన్ పవర్‌ను తమ వైపు తిప్పుకున్నారు.
ఈ ముగ్గురి రణరంగం మధ్య… ప్రస్తుత గుర్తింపు సంఘం సీపీఐ (AITUC) మాత్రం “నిశ్శబ్ద విప్లవం” చేస్తోంది. దశాబ్దాలుగా గని కార్మికుడి కష్టసుఖాల్లో భాగమైన సాంప్రదాయ బలాన్ని నమ్ముకుని, అటు కేంద్ర ప్రైవేటీకరణ విధానాలను, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల లోపాలను ఎండగడుతూ… “రాజకీయాల కోసం వచ్చే పక్షులు వస్తుంటాయి, పోతుంటాయి… కానీ మీ కోసం పోరాడే ఎర్రజెండా ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది” అంటూ గ్రౌండ్ లెవెల్ ఓట్లను పక్కాగా లాక్ చేసుకునే పనిలో పడింది. అధికార బలం, మైనింగ్ లీజులతో కాంగ్రెస్… కేంద్ర నిర్ణయాలు, తాడిచర్ల బ్లాక్ క్రెడిట్‌తో బీజేపీ.. పాదయాత్రలు, కార్మిక సెంటిమెంట్‌తో టీఆర్ఎస్… క్షేత్రస్థాయి పోరాటాల నమ్మకంతో సీపీఐ! బొగ్గు గనిలో పొలిటికల్ సెగలు రేపుతూ, సింగరేణిని శాసించే ఆ నలుగురి వ్యూహం ఇదేనా అనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. మరి ఈ వ్యూహాల సమరంలో, రానున్న ఎన్నికల్లో సింగరేణి నల్ల సూర్యుళ్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి!

