అమెరికాలో ప్రమాదం: తెలుగు యువకుడు మృతి

కలం, వెబ్ డెస్క్ : అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, ఇటీవలె ఉద్యోగంలో చేరిన ఒక తెలుగు యువకుడు స్కైడైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించాడు (Telugu Youth Dies). ఈ విషాదకర ఘటన మసాచుసెట్స్‌ (Massachusetts) రాష్ట్రంలో వెలుగుచూసింది.

పోలీసులు వివరాల ప్రకారం.. మసాచుసెట్స్‌లోని ఆరంజ్ పట్టణంలో ఉన్న స్కైడైవింగ్ కేంద్రానికి ఈ నెల 12వ తేదీన మణిచంద్ర తేజ (28) అనే యువకుడు స్కైడైవింగ్ చేయడానికి వెళ్లాడు. స్కైడైవింగ్ పూర్తి చేసుకుని కిందకు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. బలమైన గాలులు వీయడంతో మణిచంద్ర పారాచూట్ తన నియంత్రణను కోల్పోయింది.

ఈ క్రమంలో దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి మణిచంద్ర ఒక్కసారిగా కిందకు పడిపోయాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి, చికిత్స నిమిత్తం మణిచంద్రను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు.

మరణించిన మణిచంద్ర తేజ అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేసి, ఇటీవలె ఒక సంస్థలో ఉద్యోగంలో చేరాడు. అంతలోనే ఈ ఘోర ప్రమాదం జరగడం గమనార్హం. తమ కుమారుడి మరణవార్త విన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అమెరికా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>