కలం, ఖమ్మం బ్యూరో : యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ 1, స్టేజ్ 2 యాష్ ప్లాంట్లతో పాటు కోల్ ప్లాంట్లను ప్రైవేటీకరించాలనే ప్రతిపాదనలపై విద్యుత్ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం తీసుకుంటున్న ప్రైవేటీకరణ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ గ్రిడ్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TGPE JAC) ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ప్రధాన గేటు ఎదుట ఉద్యోగులు, కార్మికులు భారీ సంఖ్యలో గుమిగూడి ఆందోళన నిర్వహించారు. ఈ నిరసనలో భాగంగా ఉద్యోగులందరూ చేతులకు నల్ల బ్యాడ్జీలు ధరించి విద్యుత్ యాజమాన్యాల మొండి వైఖరికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్లాంట్లోని కీలకమైన విభాగాలను ప్రైవేట్ పరం చేయడం వల్ల సంస్థ మనుగడతో పాటు కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసే ఇలాంటి నిర్ణయాలను యాజమాన్యం తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రైవేటీకరణ ప్రతిపాదనలను వెనక్కి తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీటీపీఎస్ ఉద్యోగులు, కార్మికులు, జేఏసీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

