ప‌ర్మిష‌న్‌కి ఒక పేరు.. ప్రచారానికి మరో పేరు!

క‌లం, నిర్మ‌ల్‌: విద్యా సంవత్సరం ప్రారంభమైందంటే చాలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల (Private Schools) ప్రకటనల జోరు ఊపందుకుంటుంది. సాధారణంగా విద్యాశాఖ రికార్డుల్లో ఒక పేరుతో అనుమతి తీసుకునే యాజమాన్యాలు, ప్రచారం విషయానికి వచ్చేసరికి మాత్రం తమ పాఠశాలల పేర్ల ముందు, చివర రకరకాల రంగురంగుల తోక పేర్లను తగిలించి తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నాయి.

అనుమతి ఒక పేరు.. ప్రచారం ఇంకో పేరు!

తెలంగాణ విద్యాశాఖ నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ గుర్తింపు పత్రంలో ఉన్న పేరును మాత్రమే పాఠశాల బోర్డులపై, ప్రచార పత్రాల్లో ఉపయోగించాలి. కానీ నిర్మల్ (Nirmal) జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పాఠశాల అసలు పేరు పక్కన ‘టెక్నో’, ‘ఒలింపియాడ్’, ‘కాన్సెప్ట్’, ‘గ్లోబల్’, ‘ఇంటర్నేషనల్’ వంటి ఆకర్షణీయమైన పదాలను జోడిస్తున్నారు. ఈ స్కూళ్లలో బోధించేది రాష్ట్ర ప్రభుత్వ సిలబస్ అయినప్పటికీ, ఈ తోక పేర్లను చూపిస్తూ తాము ప్రత్యేకమైన, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామని నమ్మిస్తున్నారు. తద్వారా సామాన్యులకు అందనంత స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నారు.

కనకాపూర్‌లో వెలుగులోకి వచ్చిన ఉదంతం

లక్ష్మణచందా మండలంలోని కనకాపూర్ గ్రామంలో ప్రభుత్వం నుంచి “అక్షర హై స్కూల్” పేరుతో గుర్తింపు పొందిన పాఠశాల ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో “విశ్వ విన్నర్స్ అక్షర హై స్కూల్” పేరుతో ప్రచారం చేస్తోంది. ప్రభుత్వం నుంచి పేరు మార్పునకు అనుమతి తీసుకున్న వివరాలు లేకుండానే కొత్త పేరుతో ఫ్లెక్సీలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

విద్యాశాఖ చర్యలు తీసుకుంటుందా?

గుర్తింపు పొందిన పేరుకు భిన్నంగా ప్రచారం చేస్తున్న పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అనుమతి లేకుండా పేర్లు మార్చి ప్రచారం చేస్తున్న యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తల్లిదండ్రులను తప్పుదారి పట్టించే ప్రకటనలను నిలువరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్నను వివరణ కోరగా.. సదరు పాఠశాలకు నోటీసులు అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం నుండి జారీ చేసిన గుర్తింపు పత్రంలో ఉన్న పేరునే పాఠశాల బోర్డులో ఉపయోగించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>