కలం, కరీంనగర్ బ్యూరో: సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కమిటీ (Karimnagar SFI Protest) ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఇంటి ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అడ్డుకున్నారు. బలవంతంగా అరెస్టు చేసి సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ.. సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ సంక్షేమ రంగానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారని, వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లు అనేక సమస్యలతో కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. సంక్షేమ హాస్టళ్లలో 5 స్టార్ హోటల్ తరహాలో భోజనం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించి సంవత్సరం గడుస్తున్నా, ఇప్పటివరకు ఆ హామీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. జిల్లాలోని అనేక సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లో కనీస వసతులు లేకుండా కొనసాగుతున్నాయని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు.
మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలి..
కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్ వసతి లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. కరీంనగర్లో నూతన కళాశాల హాస్టల్ ఏర్పాటు చేయాలని కోరారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అందించే మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు.
సమస్యలు పరిష్కరించకపోతే..
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంక్షేమ హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, జిల్లా సహాయ కార్యదర్శి భోగేశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు రత్నం సురేష్, రోహిత్, నరేష్, గర్ల్స్ కన్వీనర్ మానస, నాయకులు జాన్సన్, సిద్దు, రాహుల్, రిషి, అభి, అర్ఫాన్, ఓంకార్, నాయకులు పాల్గొన్నారు.

