ఇసుక క్వారీ రద్దు చేయాలి.. ఖాజీపూర్‌ గ్రామస్థుల ధర్నా

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి రూరల్ మండలం ఖాజీపూర్ గ్రామ పరిధిలో నిర్వహిస్తున్న ఇసుక క్వారీని వెంటనే రద్దు చేయాలని కోరుతూ మంగళవారం గ్రామ సర్పంచ్ కోమటిరెడ్డి అంజనీ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులు (Khajipur Villagers Protest) పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. క్వారీ వద్దే బైఠాయించి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్వారీ వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీ కార్యకలాపాల వల్ల వెలువడుతున్న ధూళితో గ్రామాల్లోని ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు.

నిత్యం వందలాది ఇసుక లారీలు తిరగడంతో గ్రామంలోని రోడ్లు పూర్తిగా పాడయ్యాయని, దీనివల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డగోలుగా ఇసుకను తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని.. దీనివల్ల వ్యవసాయం, తాగునీటికి ఇబ్బందులు కలుగుతున్నాయని మండిపడ్డారు. రాత్రింబవళ్లు జరుగుతున్న ఇసుక తరలింపు వల్ల గ్రామస్థుల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని వాపోయారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కోమటిరెడ్డి అంజనీ కుమార్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా, నిబంధనలకు విరుద్ధంగా క్వారీని కొనసాగిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రామ అవసరాలకు, కనీసం ప్రభుత్వ అవసరాలకు కూడా ఇసుకను ఇవ్వకుండా క్వారీ నిర్వాహకులు అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా గ్రామంలో భూగర్భ జలాలు అడగండి పోతున్నాయని, స్థానికుల ఆరోగ్యం, జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ క్వారీని రద్దు చేయాలన్నారు.

లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. క్వారీ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేసి, ఉన్నతాధికారుల బృందంతో విచారణ జరిపించాలని, గ్రామానికి శాశ్వత పరిష్కారం చూపాలంటూ గ్రామస్తులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, వృద్ధులు, పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>