బుర్రలేనిది సీఎంకు కాదు.. కేటీఆర్ కే: విజయరమణ రావు

కలం, కరీంనగర్ బ్యూరో: నాడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాసుల వర్షం కురిపించుకున్న బీఆర్ఎస్.. నేడు అదే ప్రాజెక్టును కరువుతో ముడి పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు (Chinthakunta Vijayaramana Rao) మండిపడ్డారు. కేటీఆర్ కరీంనగర్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను రావు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రికి బుర్రలేదని కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, అసలు బుర్ర లేనిది కేటీఆర్ కేనని విమర్శించారు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టును బాగు చేసేందుకు మూడు మాసాల కాలం మంత్రి పదవి కావాలని కోరడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. అతని హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కుంగిపోవడం జరిగిందన్నారు. ఇది విస్మరించి మరోసారి మంత్రి పదవి కావాలని అడగడం అడుగు.. బొడుగుగా ఉన్న పెండింగ్ వసూళ్ల కోసమే అని అర్థమవుతోందని విజయరమణ రావు ఎద్దేవా చేశారు.

తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేస్తే ఎంతో ప్రయోజనంగా ఉండేదని.. పంతాలకు, పట్టుదలకు, అక్రమార్జనకు పోయి గోదావరి నది మీద ప్రాజెక్టు నిర్మించారని మండిపడ్డారు. నిర్మించిన మూడేళ్లకే మూడు బ్యారేజీలు ఎందుకు గ్యారేజీలుగా మారాయో బీఆర్ఎస్ సమాధానం చెప్పడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఎల్ఎండీ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సుమారు 6 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరు అందిస్తోందని అన్నారు.

వైఎస్ఆర్ దూరదృష్టితో ఎల్లంపల్లి నిర్మాణం..

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి దూర దృష్టితో అప్పట్లో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎప్పటికీ లైఫ్ లైన్ గా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ హయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మించిన మూడు బ్యారేజీలు ఎందుకు కూలిపోయాయి ఇప్పటికైనా సమాధానం చెప్పాలని విజయరమణ రావు డిమాండ్ చేశారు. కన్నెపల్లి పంపు హౌస్ నుండి మోటార్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోయడం వల్ల పెను ప్రమాదం పొంచి ఉందని అధికారిక ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొనడం వల్లే ప్రభుత్వం తగిన విధంగా నడుచుకుంటూ ఉందని అన్నారు.

రైతు సంక్షేమాన్ని పట్టించుకోని బీఆర్ఎస్ ప్రస్తుతం కాలేశ్వరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకొని మొసలి కన్నీళ్లు కారుస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఏది ఏమైనా ఎన్ డి ఎస్ ఏ తదుపరి నివేదికల ప్రకారమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ మార్కెట్ చైర్మన్ ఆకుల నర్సయ్య, కార్పొరేటర్లు మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>