కలం, స్పోర్ట్స్ : జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మంగళవారం టోక్యోలో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు బరిలోకి దిగుతుండగా, పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి (Satwik – Chirag) పునరాగమనం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భుజం గాయం కారణంగా సాత్విక్ గత నెల ఇండోనేషియా ఓపెన్ తర్వాత నాలుగు టోర్నీలకు దూరమయ్యాడు. ఇప్పుడు ప్రపంచ నాలుగో ర్యాంక్‌లో ఉన్న ఈ జోడీ తొలి మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన మ్యాడ్స్ వెస్టర్‌గార్డ్-డేనియల్ లండ్గార్డ్తో తలపడనుంది. ఎంఆర్ అర్జున్-హరిహరన్ అంసకరుణన్ జోడీ కూడా పురుషుల డబుల్స్‌లో పోటీ పడనుంది.
పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ జపాన్‌కు చెందిన కెంటా వతనాబేతో తొలి మ్యాచ్ ఆడనున్నాడు. యువ ఆటగాడు ఆయుష్ శెట్టి మాజీ ప్రపంచ ఛాంపియన్ కున్లావుట్ విటిడ్సార్న్‌ను ఎదుర్కోనున్నాడు. మహిళల సింగిల్స్‌లో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మలేషియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్‌తో తొలి రౌండ్లో తలపడనుంది. ఉన్నతి హుడా చైనీస్ తైపీకి చెందిన హువాంగ్ యూ-హ్సున్ను ఎదుర్కోనుంది.
మిక్స్డ్ డబుల్స్‌లో ధృవ్ కపిలా-తనీషా క్రాస్టో, రోహన్ కపూర్-రుత్విక శివాని గడ్డె జోడీలు భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాయి. అయితే మహిళల డబుల్స్‌లో ట్రీజా జాలీ-గాయత్రి గోపీచంద్ పుల్లెల టోర్నీకి ముందే తప్పుకోవడంతో భారత్‌కు ప్రాతినిధ్యం ఉండదు. ప్రపంచ ఛాంపియన్షిప్, ఆసియా క్రీడలకు ముందు జరుగుతున్న ఈ టోర్నీ భారత ఆటగాళ్లకు కీలకంగా మారింది. ఇప్పటివరకు జపాన్ ఓపెన్‌లో భారత్ ఒక్క టైటిల్ కూడా గెలవలేదు.

