కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌పై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యాదగిరిగుట్ట పట్టణ పోలీస్ స్టేషన్‌లో పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.
అహంకారానికి నిదర్శనం..
ఈ సందర్భంగా యాదగిరిగుట్ట మసాపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు భీమగాని నరసింహ గౌడ్ మాట్లాడుతూ… ఒక బీసీ మహిళను గౌరవప్రదమైన బోర్డు మెంబర్‌గా నియమిస్తే, కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. తల్లి లాంటి మహిళ అని కూడా చూడకుండా, ఈశ్వరమ్మ యాదవ్‌పై శివచరణ్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించడం దుర్మార్గమన్నారు.
ఒక మహిళా ప్రతినిధిని ఇంత దారుణంగా అవమానించడం అహంకారానికి నిదర్శనమని నరసింహ గౌడ్ ధ్వజమెత్తారు. పోలీసులు తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు జక్కుల చంద్రయ్య యాదవ్, గుణగంటి బాబురావు గౌడ్, శ్రీశైలం, భీమగాని వెంకటేష్, మాటూరి సురేష్, అరె సుధాకర్, నవీన్, ఐలయ్య తదితరులు పాల్గొని స్టేషన్ బయట నిరసన వ్యక్తం చేశారు.

