కలం, వరంగల్ బ్యూరో: రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో 61 పతకాలు సాధించిన వరంగల్ పోలీస్ (Warangal Police) కమిషనరేట్ క్రీడాకారులను సోమవారం పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అభినందించారు. ఇటీవల మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన ఐదో రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ తొలి క్లస్టర్లో వరంగల్ కమిషనరేట్ క్రీడాకారులు మొత్తం 61 పతకాలు సాధించారు.
ఈ సందర్భంగా కమిషనరేట్ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీ ఎన్. శ్వేత మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోటీల్లో వరంగల్ కమిషనరేట్ తరఫున ప్రాతినిధ్యం వహించి అత్యుత్తమ ప్రతిభ కనబర్చి 61 పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. పతక విజేతలను అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో క్రీడల్లో మరింత రాణించాలని ఆకాంక్షించారు. పోలీసు విధుల్లో శారీరక దారుఢ్యం, ఆరోగ్య పరిరక్షణ ఎంతో కీలకమని, క్రీడాకారులు తోటి సిబ్బందికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ప్రతి పోలీసు ఉద్యోగి వారానికి మూడు నుంచి నాలుగు రోజులు కొంత సమయం కేటాయించి వ్యాయామం, క్రీడల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేష్ కుమార్, శ్రీనివాస్, బాలస్వామి, ప్రభాకర్ రావు, ఏసీపీ నాగయ్య, ఆర్ఐ స్పర్జన్ రాజ్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

