కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని హాపుర్ జిల్లాలో షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. రియా అనే ఓ ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయురాలు నగల కొనుగోలు కోసం ఢిల్లీ రోడ్డులోని అర్జున్ నగర్ లో ఉన్న ఒక జ్యువెలరీ షాపునకు వెళ్లారు. అక్కడ ఆమెకు దాహం వేయడంతో తాగడానికి నీళ్లు అడిగారు. దాంతో ఆ షాపు యజమాని తన వద్ద పనిచేసే ఒక ఉద్యోగికి రూ.20 ఇచ్చి, రోడ్డుకు అవతలి వైపు ఉన్న మిఠాయి దుకాణం నుంచి నీళ్ల బాటిల్ తీసుకురావాల్సిందిగా పంపించారు.
ఆ ఉద్యోగి ఎదురుగా ఉన్న దుకాణానికి వెళ్లి సీల్ చేసినట్లుగా ఉన్న ఒక బిస్లరీ వాటర్ బాటిల్ ను తీసుకువచ్చి రియాకు ఇచ్చారు. అయితే రియా నీళ్లు అనుకుని నోట్లో పోసుకుని ఒక్క గుటక వేశారు. అంతే, తక్షణమే ఆమె నోరు, గొంతు, కాలిపోయాయి. తీవ్రమైన మంట, నొప్పితో ఆమె ఒక్కసారిగా కేకలు వేస్తూ దుకాణం వెలుపలికి పరుగులు తీశారు. ఆమెతో పాటు వచ్చిన తల్లి, అక్కడి వారు వెంటనే స్పందించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను మీరట్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రియా అక్కడ ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సిసి టివి (CCTV) కెమెరాలో రికార్డయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జ్యువెలరీ షాప్ యజమాని, మిఠాయి దుకాణం యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిఠాయి దుకాణదారుడు తన డీప్ ఫ్రీజర్లో ఎవరో యాసిడ్ నింపిన బాటిల్ ను పెట్టారని, దానిని పొరపాటున వాటర్ బాటిల్ అనుకుని ఇచ్చామని చెబుతున్నారు. అయితే, కొందరు స్థానికులు మాత్రం వాటర్ బాటిళ్ల కంపెనీల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. బ్రాండెడ్ వాటర్ బాటిల్ లో యాసిడ్ ఎలా వచ్చిందనే దానిపై ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా రంగంలోకి దిగింది. మెడికల్ రిపోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశోధనల తర్వాతే అసలు నిజం బయటపడనుంది.

