కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రక్షణ సేన పేరు మార్చుకుంటే తమకు తీవ్ర నష్టం కలుగుతుందని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి పేర్లతో ఈసీ ఇప్పటికే రెండు పార్టీలకు గుర్తింపు ఇచ్చిందన్నారు. వాటికి లేని అభ్యంతరాలు తమ పార్టీకే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. వెంటనే టీఆర్ఎస్ పార్టీకి గుర్తింపు ఇవ్వాలని కవిత విజ్ఞప్తి చేశారు.
జెండాలు కూడా ఆవిష్కరించాం..
‘తెలంగాణ రక్షణ సేన’ పేరును తమకు కేటాయిస్తూ 2026 ఏప్రిల్ 28న కేంద్ర ఎన్నికల సంఘం లేఖ ద్వారా సమాచారం ఇచ్చిందని కల్వకుంట్ల కవిత వివరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ జెండాలు ఆవిష్కరించడంతో పాటు పార్టీ పరమైన కార్యక్రమాలు కూడా మొదలు పెట్టామన్నారు. ఇప్పుడు పేరు మార్చుకుంటే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు.
అభ్యంతరాలు మాకు పంపించండి..
టీఆర్ఎస్ (TRS) పేరును కేటాయించొద్దని ఈసీకి వచ్చిన వెయ్యి అభ్యంతరాలను తమకు పంపించాలని కవిత (Kavitha) కోరారు. ఢిల్లీ హైకోర్ట్ ఆదేశాల ప్రకారం వ్యక్తిగతంగా ఈసీ ముందు హాజరు కావడానికి ముందే తమకు పంపించాలన్నారు. ఇంతవరకు పంపనే లేదని.. అలాంటప్పుడు వాటికి తాము ఎలా సమాధానం ఇవ్వాలని ఈసీని ప్రశ్నించారు.
మూడున్నర కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో.. వెయ్యి అభ్యంతరాలు రావడమేంటన్నారు. ఎవరో కావాలనే దురుద్దేశంతో, గ్రూపులుగా ఏర్పడి ఒకేసారి ఇలా చేసి ఉంటారనే అనుమానం కలుగుతోందన్నారు.
స్వతంత్రంగా ఆలోచించి పెట్టాం..
తెలంగాణ రక్షణ సేన పేరును పూర్తి స్వతంత్రంగా ఆలోచించి పెట్టామని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రెండు పార్టీలను పరిశీలించేటప్పుడు పూర్తి పేర్లను పరిగణనలోకి తీసుకోవాలని.. అంతే తప్ప ముక్కలు ముక్కలు చేసి.. విడదీసి చూడొద్దని హితవు పలికారు. అలా చూసినప్పుడు టీఆర్ఎస్ పేరు ఉనికిలో ఉన్న ఏ పార్టీతో సరిపోలదన్నారు.
గతంలో కూడా ఒకే రకమైన భౌగోళిక వర్ణనాత్మక, సిద్ధాంతపరమైన పదాలు ఉన్నాయనే కారణంతో పార్టీ రిజిస్ట్రేషన్ నిరాకరించిన దాఖలాలు కూడా లేవని వివరించారు. ఈ మేరకు ఒకే రకమైన పేర్లు కలిగి గుర్తింపు పొందిన పార్టీ పేర్ల జాబితాను అందించారు.
Read Also: కేసీఆర్ వస్తే లాగులు తడుపుకుంటారు.. జగదీశ్ రెడ్డి ఫైర్
Follow Us On: X(Twitter)

