కలం, నాగర్‌కర్నూల్: తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు నాగర్‌కర్నూల్‌లోని లక్ష్య అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్‌కు చెందిన క్రీడాకారులు (Nagarkurnool Athletes) ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులు ఈ నెల 30, డిసెంబర్ 1వ తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొననున్నారు. వివిధ విభాగాల్లో రాధిక, దర్శి, గణేష్, జ్ఞానేశ్వర్, అజయ్, నవీన్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారులను నాగర్‌కర్నూల్ ఎస్సై వెంకట్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
ఎస్సై వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడల్లో క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో రాణిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించవచ్చని అన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కోచ్ రాణా మల్లేష్ మాట్లాడుతూ.. విద్యార్థుల నిరంతర కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీస్తూ యువ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న లక్ష్య అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్‌ను పలువురు అభినందించారు.

