కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లాలో ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (SI) బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తీరు కలకలం రేపుతోంది. గంధంగూడ (Gandhamguda) – బైరాగిగూడ ప్రధాన రహదారిపై రద్దీ ఉన్న సమయంలో ఆయన తన ఆరేళ్ల మనవరాలికి కారు (TS 07 GP 7450) డ్రైవింగ్ నేర్పించడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. ఈ నిర్వాకం వల్ల వాహనాలు బంపర్ టు బంపర్ నిలిచిపోయి, రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదకరమైన రీతిలో మైనర్ బాలికతో డ్రైవింగ్ చేయించడమే కాకుండా, ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తుండటంతో స్థానికులు ఈ విషయమై ఎస్ఐని ప్రశ్నించారు.
అయితే, తన తప్పును అంగీకరించి సరిదిద్దుకోవడానికి బదులుగా, ఆ అధికారి స్థానికులనే దబాయించారు. ‘నా ఇష్టం, నన్ను అడగడానికి మీరెవరు?’ అంటూ ఆయన ఎదురుదాడికి దిగినట్లు సమాచారం. ఈ మొత్తం ఉదంతాన్ని అక్కడున్న వారు వీడియో తీయగా, ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ అధికారే ఇలా రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అందరికీ చట్టం ఒక్కటేనని, సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

