కలం, నల్లగొండ బ్యూరో : ఉమ్మడి నల్లగొండ జిల్లా గత అసెంబ్లీ ఎన్నికల వరకు గులాబీమయంగా ఉండేది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క నియోజకవర్గం మినహా అన్నింటా దారుణంగా బోల్తా పడింది. అయితే సగం నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల ఆజామాయిషీ, వర్గపోరు, పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడడం వల్లేననే చర్చ రాజకీయవర్గాల్లో విస్తృతంగా జరిగింది. ఆ నేపథ్యంలోనే కొంతమంది బీఆర్ఎస్ కీలక లీడర్లు, మాజీ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేసింది. కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి ఎక్కడా కన్పించలేదు.
అయితే తాజాగా నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) హాజరయ్యారు. ఈ వేదికపై మరోసారి బీఆర్ఎస్‌లోని లుకలుకలు బయటపడ్డాయి. కేటీఆర్ వేదికపై ఉండగానే.. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) మాట్లాడుతూ.. పార్టీలో ఉంటూ పార్టీ పేరు చెప్పుకుంటూ పార్టీకి నష్టం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం కలకలం రేపింది. అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని (Jagadish Reddy) ఉద్దేశించి చేసినట్టు ప్రచారం ఊపందుకుంది.
సగం నియోజకవర్గాల్లో అసంతృప్తి..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే.. అందులో దాదాపు సగానికి పైగా నియోజకవర్గాల్లో వర్గపోరు ఉంది. అందుకు ప్రధాన కారణం మాజీమంత్రి జగదీష్ రెడ్డి అనే ప్రచారం లేకపోలేదు. ఈ క్రమంలోనే జగదీష్ రెడ్డి తీరుపై చాలామంది లీడర్లు తమ అసంతృప్తిని పార్టీ పెద్దల వద్ద ఇప్పటికే వెళ్లగక్కారు. కొంతమంది లీడర్లు పార్టీని సైతం వదిలివెళ్లిపోయారు. హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సైతం ఈ తరహాలోనే వెళ్లినట్టు ప్రచారం ఉంది.
నకిరేకల్, నాగార్జునసాగర్, భువనగిరి, ఆలేరు, మునుగోడు, హుజూర్‌నగర్ తదితర నియోజకవర్గాల్లో మాజీమంత్రి జగదీష్ రెడ్డి వర్గపోరును దగ్గరుండీ ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. నకిరేకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah)కు వ్యతిరేకంగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేత నలగాటి ప్రసన్నరాజ్‌ను ప్రోత్సహిస్తున్నారని పెద్దఎత్తున ప్రచారం ఉంది. ఆ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే లింగయ్య, మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి మధ్య విభేదాలు పొడసూపినట్టు తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యేగా తాను ఉన్నప్పటికీ నలగాటి ప్రసన్నరాజ్‌ను వెనుక ఉండి జగదీష్ రెడ్డి నడిపిస్తున్నారని, అందులో భాగంగానే నకిరేకల్ బీఆర్ఎస్ రెండు వర్గాలుగా వీడిపోయిందని బీఆర్ఎస్ క్యాడర్ ఆగ్రహం వెళ్లగక్కుతోంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పెద్దలు ఉమ్మడి నల్లగొండ వర్గపోరుపై కన్నేస్తారో.. లేదో.. వేచి చూడాల్సిందే.
Read Also: కేసీఆర్‌పై రేవంత్ శపథం
Follow Us On: Pinterest


