కలం, కరీంనగర్ బ్యూరో: జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్ను (Karimnagar Police) కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులు, కేసుల నిర్వహణ, బాధితులకు అందిస్తున్న సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడిన పోలీస్ కమిషనర్, రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. మహిళా పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వర, నాణ్యమైన సేవలు అందిస్తూ సానుభూతితో వ్యవహరించాలని ఆదేశించారు.
పెండింగ్లో ఉన్న కేసులను సమీక్షించిన ఆయన, వాటి ఆలస్యానికి గల కారణాలను తెలుసుకుని, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను ప్రాధాన్యత ఆధారంగా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తును నాణ్యతతో నిర్వహించి, నిందితులకు చట్టప్రకారం శిక్షలు పడేలా పకడ్బందీగా విచారణ చేపట్టాలని సూచించారు.
అలాగే మహిళా బాధితులకు భూమిక ద్వారా అందిస్తున్న కౌన్సిలింగ్ సేవలపై ఆరా తీసిన పోలీస్ కమిషనర్, బాధితుల సమస్యలను సున్నితంగా పరిష్కరించే దిశగా కౌన్సిలింగ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ తనిఖీలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పుల్లయ్యతో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

