25 ఏళ్ల ఫుట్‌బాల్ స్టార్ మృతి

క‌లం, వెబ్ డెస్క్‌: ఫుట్‌బాల్ ప్రపంచంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా యువ స్టార్ జేడెన్ ఆడమ్స్ (Jayden Adams) కన్నుమూశాడు. కేవలం 25 ఏళ్ల వయసులోనే అతని జీవితం ముగిసింది. ఇటీవలే ఫిఫా వరల్డ్‌కప్‌లో అరంగేట్రం చేసిన ఈ మిడ్‌ఫీల్డర్ మరణం అభిమానులను షాక్‌కు గురి చేసింది. మామెలోడి సండౌన్స్ తరఫున జేడెన్ ఆడమ్స్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. జట్టుకు CAF ఛాంపియన్స్ లీగ్ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

అదే ప్రదర్శనతో దక్షిణాఫ్రికా వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. బఫానా బఫానా జట్టు నాకౌట్ దశకు చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. చివరకు కెనడాతో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో 1-0తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. జేడెన్ జీవితంలో వరల్డ్‌కప్ ప్రయాణం భావోద్వేగాలతో నిండిపోయింది. చెక్ రిపబ్లిక్‌తో గ్రూప్ మ్యాచ్‌కు రెండు వారాల ముందు తన అమ్మమ్మ మరియానా ఆడమ్స్‌ను కోల్పోయాడు.

అయినా దేశం కోసం వరల్డ్‌కప్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. అతని అంకితభావానికి అప్పట్లో ప్రశంసలు లభించాయి. జేడెన్ మెంటర్ బ్రెండైన్ జాన్సన్ మాట్లాడుతూ, అతని ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర విషాదంలోకి నెట్టిందన్నారు. వరల్డ్‌కప్ ముగించుకుని ఎంతో ఉత్సాహంగా స్వదేశానికి తిరిగొచ్చాడని తెలిపారు. కొత్త సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడని, కొన్ని రోజుల క్రితమే తనతో మాట్లాడాడని చెప్పారు.

భవిష్యత్‌పై అతనిలో ఎంతో నమ్మకం కనిపించిందని గుర్తు చేశారు. జేడెన్ మరణానికి గల కారణాన్ని ఇంకా వెల్లడించలేదు. వరల్డ్‌కప్ కలను నిజం చేసుకున్న కొద్ది వారాల్లోనే అతని జీవితం ముగియడం ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>