కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో (Shabad) జరిగిన ఆరుగురి హత్యలు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోక్సో (POCSO) నిందితుడికి బెయిల్ లభించే పరిస్థితి కల్పించి ఆరుగురి ప్రాణాలు కోల్పోయేలా పోలీసులు వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల భద్రతను కాపాడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
రేవంత్ క్షమాపణలు చెప్పాలి..
మహిళల భద్రత విషయంలో వైఫల్యానికి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోర్టులో బలమైన వాదనలు వినిపించకపోవడం వల్లే నిందితుడు బెయిల్‌పై బయటకు వచ్చాడని ఆయన (KTR) అన్నారు. షాబాద్ ఘటన ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్న కేటీఆర్.. రాష్ట్రంలో మహిళలు, బాలికల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని దుయ్యబట్టారు. కనీసం ఫిర్యాదు చేయడానికి కూడా బాధిత కుటుంబాలు భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి..
షాబాద్‌లో జరిగిన ఈ ఆరు హత్యలు సాధారణ హత్యలు కావని.. ఇవి ప్రభుత్వ అసమర్థత, చేతకానితనం వల్ల జరిగిన ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుల పలుకుబడి, డబ్బు ప్రభావం ముందు ప్రభుత్వం తలవంచిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also: ఈటల అంటే గౌరవమే కానీ.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

