కలం, ఖమ్మం బ్యూరో: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఖమ్మం (Khammam), భదాద్రి కొత్తగూడెం అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ, ఈ నెల 24 నాటికి డిజిటలైజేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు. సరైన విచారణ లేకుండా ఏ ఓటరు పేరును జాబితా నుంచి తొలగించకూడదని అధికారులకు సూచించారు. అలాగే పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణలో భాగంగా ఏ కేంద్రంలోనూ ఓటర్ల సంఖ్య 1,200 కంటే ఎక్కువ ఉండకుండా జాగ్రత్త వహించాలన్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పందిస్తూ.. రాష్ట్రంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 99.6 శాతం, డిజిటైజేషన్ ప్రక్రియ 21.94 శాతం పూర్తయిందన్నారు. మిగిలిన ప్రక్రియను త్వరితగతిన ముగిస్తామని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఇతర అధికారులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

