కలం, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా (Australia) వేదికగా ఐపీఎల్ మ్యాచ్‌లు (IPL Matches) నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం క్రికెట్ ఆస్ట్రేలియా బీసీసీఐకి బహిరంగ ఆహ్వానం పలికినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అంశంపై ఇరు దేశాల మధ్య రహస్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ శనివారం క్రీడా సహకారానికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య కుదిరిన స్పోర్ట్స్ కోఆపరేషన్ ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ 12న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ (BBL) తొలి మ్యాచ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
మెల్‌బోర్న్ రెనెగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ భారతదేశంలో నిర్వహించే తొలి విదేశీ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌గా నిలవనుంది. ఇకపై ప్రతి ఏడాది బిగ్ బాష్ లీగ్ ప్రారంభ మ్యాచ్‌ను చెన్నైలో నిర్వహించాలనే ఆలోచనలో ఆస్ట్రేలియా ఉన్నట్లు సమాచారం. దీనికి ప్రతిగా ఆస్ట్రేలియాలో కూడా ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించాలని ఆస్ట్రేలియా బీసీసీఐని కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. భారత్–ఆస్ట్రేలియా మధ్య సాంస్కృతిక, క్రీడా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ‘జీ డే నమస్తే’ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు స్పోర్ట్స్ రోడ్‌మ్యాప్‌ను విడుదల చేశారు. కార్యక్రమానికి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు స్టీవ్ వా, లిసా స్థాలేకర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ క్రీడలు ప్రజలను ఏకం చేసే శక్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. మహిళల ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు తెలిపారు. 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్, 2032 ఒలింపిక్స్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ఈ క్రీడా సహకార ఒప్పందం ఇరు దేశాలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

