SIR​ ప్రక్రియ.. నిజమాబాద్​ లో ముగ్గురు అధికారులకు ఝలక్

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లాలో సర్ (SIR) అమలుపై కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) ఈఆర్ఓలు, ఏఈఆర్ఓ లు, సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల నుండి ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, వాటి వివరాలను డిజిటలైజ్ చేయడంలో వెనుకంజలో ఉన్న సూపర్వైజర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పురోగతి చూపని నిజామాబాద్ అర్బన్ పరిధిలోని ముగ్గురు సూపర్వైజర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఐఆర్ అమలు తీరును తేలికగా తీసుకోరాదని, నిర్ణీత గడువు లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయని వారిపై ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. గడువు సమీపించిన దృష్ట్యా శని, ఆదివారాలు సెలవు దినాలలో కూడా పని చేయాలని తేల్చి చెప్పారు. వచ్చే సోమవారం నాటికి అర్బన్ లో 35 శాతం, రూరల్ నియోజకవర్గాల పరిధిలో 50 శాతం ప్రక్రియ పూర్తి కావాలని లక్ష్యంగా నిర్దేశించారు.

ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు కూడా క్షేత్రస్థాయిలో ఉంటూ, ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, వాటి డిజిటలైజేషన్ ప్రక్రియలు వేగవంతం అయ్యేలా పర్యవేక్షించాలన్నారు. రోజువారీ ప్రగతిని తనకు నివేదించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరు ఓటర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఎన్యూమరేషన్ ఫారాలు సరైన విధంగా పూరించడంలో వారికి సహకరించాలని హితవు పలికారు.

ప్రతి బీఎల్ఓ వద్ద ఫొటోలతో కూడిన ఓటరు జాబితా తప్పనిసరిగా ఉండాలన్నారు. వివరాల పరిశీలన సమయంలో అందుబాటులో లేని, చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్ళిన, రెండు చోట్ల ఓటు కలిగిన ఓటర్ల పేర్లను గుర్తిస్తూ పక్కాగా జాబితాను రూపొందించాలని కలెక్టర్ (Ila Tripathi) ఆదేశించారు. ఈ జాబితాపై రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని సూచించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బీఎల్ఏలు స్థానికంగా అందుబాటులో ఉంటూ, ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు బీఎల్ఓలకు తగిన సహకారం అందించాలన్నారు.

ప్రతి రోజు ఓటర్ల నుండి 50 చొప్పున ఎన్యూమరేషన్ ఫారాలు సేకరిస్తూ బీఎల్ఓ లకు అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, విజయలక్ష్మి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఏఈఆర్ఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.

సర్ ప్రక్రియ అమలు తీరుపై సమీక్ష..

కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటి కమిషనర్ పవన్ కుమార్ శర్మ న్యూడిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణలోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డితో పాటు అన్ని జిల్లా కలెక్టర్లతో సర్​ (ఎస్ఐఆర్) అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల వారీగా ఎస్ఐఆర్ అమలులో ఇప్పటివరకు సాధించిన ప్రగతి గురించి అడిగి తెలుసుకుని, ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ త్రిపాఠి ప్రజలకు, అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారంలను తగిన వివరాలతో పూరించి త్వరితగతిన బీఎల్ఓల కు అందించాలని ఇలా త్రిపాఠి ఓటర్లకు సూచించారు. వివరాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉన్నందున, నిర్ణీత గడువు వరకు వేచి చూడకుండా వెంటదివెంట ఫారాలను నింపి బీఎల్ఓలకు సమర్పించాలని ఓటర్లను కోరారు.

Read Also: ఈ ఒక్క పని చేయండి.. రూ.25 లక్షలతో ఉద్యోగం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>