కలం, కరీంనగర్ బ్యూరో: భారత ఎన్నికల సంఘం ఓటరు జాబితా సవరణ కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) పిలుపునిచ్చారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ధర్మపురి (Dharmapuri) మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో కొనసాగుతున్న SIR ప్రక్రియను మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఓటరు నమోదు, వివరాల సేకరణ జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో సవరణ ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములై తమ ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు. భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని అన్నారు.
ఓటు హక్కు ద్వారా ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం పొందుతున్నారని మంత్రి (Minister Adluri) తెలిపారు. రాష్ట్రంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. SIR ప్రక్రియ క్షేత్రస్థాయిలో ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు తాను పర్యటిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఓటర్లు తమకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులకు అందించాలని కోరారు.
ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వాములవుతున్న ఎన్నికల అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. ఓటరు నమోదుకు అవసరమైన వివరాలను అందించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ SIR ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: ఈ ఒక్క పని చేయండి.. రూ.25 లక్షలతో ఉద్యోగం!
Follow Us On: Instagram

