కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం అయింది: బీఆర్ఎస్‌పై పటేల్ రమేష్ రెడ్డి విమర్శలు

కలం, సూర్యాపేట: తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, సుమారు రూ.8.20 లక్షల కోట్ల మేర ఆర్థిక విధ్వంసం సృష్టించారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి (Patel Ramesh Reddy) విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీఆర్ఎస్ నాయకుల లక్ష్యంగా మారిందన్నారు.

సూర్యాపేట (Suryapet) లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో పాలన సాగిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు జీతాల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేదని, కానీ ప్రస్తుతం ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బందికి జీతాలు చెల్లించడమే కాకుండా పెండింగ్ బకాయిలను కూడా క్లియర్ చేస్తోందని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ (BRS) నేతలు ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా తమ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. రూ. 1.27 లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందలేదని విమర్శించారు. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీరు వచ్చేదని తెలిసినా, అంచనాలు పెంచి భారీ కమీషన్ల కోసం మేడిగడ్డ వద్ద నిర్మించారని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) “కాళేశ్వరం” నుంచి కూలేశ్వరంగా మారిపోయిందని, 50 టీఎంసీల నీటిని కూడా ఎత్తిపోసే సామర్థ్యం లేకపోయినా వేల కోట్ల అప్పులు రాష్ట్ర ప్రజలపై మోపారని అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌ను పూర్తిస్థాయిలో నింపితే పరిసర గ్రామాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. హరీష్ రావు, కేటీఆర్‌లపై విమర్శలు గుప్పిస్తూ, వారిద్దరూ “బిల్లా-రంగా” తరహాలో పోటీ పడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.

మూడు వారాల్లో కాళేశ్వరం ప్రాజెక్టును బాగు చేస్తానని చెప్పే హరీష్ రావు, గత తొమ్మిదేళ్లలో ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం వేల ఎకరాల ఫామ్ హౌస్‌లు ఎలా సంపాదించిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నియోజకవర్గంలో 3,000 ఇందిరమ్మ ఇళ్లను రూ.5 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు.

పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. సూర్యాపేటకు కాళేశ్వరం ద్వారా నీళ్లు వచ్చాయని జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, వాస్తవానికి జలయజ్ఞం కింద శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారానే ఈ ప్రాంతానికి సాగునీరు అందిందని స్పష్టం చేశారు. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను సరిచేసి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకువస్తామని, బీఆర్ఎస్ చేసిన ఆర్థిక నష్టాన్ని అధిగమిస్తూ తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పటేల్ రమేష్ రెడ్డి (Patel Ramesh Reddy) ధీమా వ్యక్తం చేశారు.

Read Also: కల్వకుంట్ల కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతాం: సీఎం రేవంత్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>