కలం, వెబ్ డెస్క్: రైతులకు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. వ్యవసాయ రంగానికి ఇప్పటివరకు రూ.1.67 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. బీఆర్ఎస్ హయాంలో కనీసం పంట నష్టపరిహారం కూడా చెల్లించలేదన్నారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభలో భట్టి విక్రమార్క ప్రసంగించారు.
దశాబ్దాలు కట్టినా చెక్కుచెదరలేదు..
కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ ప్రాజెక్టులు దశాబ్దాలవుతున్నా చెక్కు చెదరలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మాత్రం ఏడాదికే కూలిపోయిందన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలకమైన సీతారామ ప్రాజెక్టును పోయిన ప్రభుత్వం అసలే పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే.. కాలువల పనులు చకచకా పూర్తి చేసిందన్నారు.
కాళేశ్వరం పేరిట దోచుకున్నారు..
గోదావరి నదిపై కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టుల పేరిట రూ.1.50 లక్షల కోట్లను బీఆర్ఎస్ లూటీ చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పగిస్తే.. పదేళ్లలో రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లిపోయారన్నారు.
వారు చేసినవాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రూ.2 లక్షల కోట్ల వడ్డీలు కట్టిందన్నారు. ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తూ.. వారికి రావాల్సిన బకాయిలను ఇప్పటివరకు రూ.6 వేల కోట్లు కూడా చెల్లించామని వివరించారు.
ఫాంహౌస్‌లో పడుకుని..
కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకుని.. హరీశ్ రావు, కేటీఆర్‌ను రాష్ట్రం మీదకు వదలారని భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి వర్తమానం, భవిష్యత్తు లేదని.. అదొక చరిత్ర మాత్రమే అన్నారు. వారెన్ని కుట్రలు చేసినా.. మళ్లీ అధికారంలోకి రాలేరని స్పష్టం చేశారు.
మంత్రులంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారేనని.. గ్రామాలు బాగుండాలనేదే తమ లక్ష్యమన్నారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మూడు ట్రిలియన్ డాలర్ల వ్యవస్థ మారేలా చేస్తామన్నారు.

