కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు (Seasonal Diseases) ప్రబలకుండా ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రైడే కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతంగా నిర్వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) పిలుపునిచ్చారు. శుక్రవారం వనపర్తి పట్టణంలోని 26వ వార్డు టీచర్స్ కాలనీలో నిర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలకు పరిశుభ్రత, దోమల నివారణ, నీరు నిల్వ ఉండకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జ్వరాల నివారణపై అవగాహన కల్పిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు.
వర్షాకాలంలో ఫీవర్ సర్వేలను వేగవంతం చేసి, జ్వరం లక్షణాలు ఉన్న వారిని వెంటనే గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలు, కాలనీలలో పారిశుధ్య నిర్వహణ, చెత్త తొలగింపు, నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు యాంటీ లార్వా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని, ప్రజలలో పరిశుభ్రతపై అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు.
అనంతరం కలెక్టర్ (Collector Adarsh Surabhi) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై బూత్ లెవల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా అర్హులైన ప్రతి ఓటరును నమోదు చేయాలని, మరణించిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించి సంబంధిత రికార్డులను సకాలంలో సమర్పించాలని ఆదేశించారు.
ఓటరు జాబితా పూర్తిస్థాయిలో ఖచ్చితత్వంతో ఉండేలా ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించాలని సూచించారు. ఓటర్ల వద్దకు వెళ్లి ఫారం పూరించడం తెలియని వారికి సహాయం అందించాలని, పూరించిన ఫారాలను త్వరితగతిన సేకరించాలని బూత్ లెవల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, తహసీల్దార్ రమేష్ రెడ్డి, వైద్యశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఆరోగ్య సిబ్బంది, బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు.
Read Also: కల్వకుంట్ల కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతాం: సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)

