అసెంబ్లీ ఎన్నిక‌లు ఎప్పుడో చెప్పేసిన సీఎం రేవంత్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అసెంబ్లీ ఎన్నిక‌లు ఏ ఏడాది, ఏ నెల‌లో జ‌రుగుతాయ‌నే దానిపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జ‌రుగుతున్న కాంగ్రెస్‌ రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. అంద‌రూ అనుకుంటున్న‌ట్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు (Telangana Assembly Elections) 2029 డిసెంబ‌ర్‌లో జ‌ర‌గ‌వ‌ని, 2028 డిసెంబ‌ర్‌లో కూడా జ‌ర‌గ‌వ‌ని అన్నారు. 2029లో మే లేదా జూన్‌లోనే ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌క‌టించారు. ఈ రోజు తాను చెప్పింది జ‌రిగి తీరుతుంద‌ని తేల్చి చెప్పారు. అలాగే మ‌ళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంద‌ని, ప్ర‌జా ప్ర‌భుత్వ‌మే కొలువు దీరుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

కేంద్రంలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌పై రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. న‌రేంద్ర మోదీ, అమిత్ షాలు మ‌మ‌తా బెన‌ర్జీ పార్టీని, ఆప్‌ను చీల్చార‌ని ఆరోపించారు. ఇత‌ర పార్టీల‌ను కూడా లొంగ‌దీసుకుంటున్నార‌ని అన్నారు. రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బెదిరించి, లొంగ‌దీసుకొని సీట్లు పెంచే బిల్లును ఆమోదింపచేసుకోవాల‌ని భావిస్తున్నార‌న్నారు. ఈ పాపంలో వారు విజ‌యం సాధించ‌డానికి అవ‌కాశం ఉంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో పెర‌గ‌నున్న‌ అసెంబ్లీ, పార్ల‌మెంట్ స్థానాల‌పై రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ‌లో పార్లమెంట్ సీట్లు 26కు, అసెంబ్లీ సీట్లు 182 స్థానాలు పెరుగుతాయ‌న్నారు. వీటిలో కాంగ్రెస్ 117 అసెంబ్లీ, 20 పార్లమెంట్ స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. 36 నెలల ముందుగానే వచ్చే ఎన్నికల ఫలితాల జోస్యం చెబుతున్నాన‌ని, రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని సీఎం అన్నారు. భద్రాచలం రాములవారి మీద ఆన‌ అని, ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట అని అన్నారు. ఈ మాట కోసం రోజుకు 18 గంటలు పని చేస్తామ‌ని చెప్పారు.

ఖమ్మం జిల్లా నా గుండెకాయ..

రాజకీయంగా పాలమూరు త‌న‌కు ప్రాణమైతే.. ఖమ్మం జిల్లా గుండెకాయ లాంటిద‌ని సీఎం అన్నారు. 2023 జూలైలో పొంగులేటి చేరిక సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజలు ఉప్పెనలా వచ్చి బీఆర్ఎస్‌ను బొంద పెట్టార‌న్నారు. సరిగ్గా ఇప్పుడు అదే జూలై నెల‌లో బీఆర్ఎస్‌ను మళ్లీ మొలకెత్తనివ్వమని చింతకాని సభకు వేలాది మంది ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చార‌ని తెలిపారు. రాష్ట్ర ప్ర‌జ‌ల్లో 2023లో ప్రభుత్వ ఏర్పాటు నుంచి ప్రతీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించార‌ని సంతోషం వ్య‌క్తం చేశారు.

రైతుల‌ను ఆదుకుంటున్న ప్ర‌భుత్వం

రాష్ట్రంలో ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి రైతులను ఆదుకుంటున్నామ‌ని సీఎం అన్నారు. రైతు భరోసాను 12 వేలకు పెంచామ‌ని, రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేశామ‌ని చెప్పారు. ప్రతీ పేదవాడికి రేషన్ కార్డు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు అంద‌జేశామ‌న్నారు. బీఆర్ఎస్ అమలు చేసిన షాది ముబారక్, రైతు బంధు పథకాలను కూడా కొన‌సాగిస్తున్న‌ట్లు తెలిపారు.

స‌ర్వేల దుష్ప్ర‌చారంపై ఆగ్ర‌హం

సీఎం రేవంత్ రెడ్డి సర్వేలో కాంగ్రెస్ ఓడిపోతుందని రిజ‌ల్ట్ వ‌చ్చింద‌న్న కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై సీఎం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌ర్వేల పేర‌తో త‌న‌పై దుష్ప్రచారానికి దిగార‌ని మండిప‌డ్డారు. ఎన్నికలు ఎప్పుడో తెలియకుండా, రిజర్వేషన్లు ఎలా మారుతాయో తెలియకుండా ఎవరైనా సర్వేలు చేస్తారా? అని ప్ర‌శ్నించారు. వీటిని లెక్క చేయ‌కుండా గెలుపు, ఓటముల‌ను ఎలా నిర్ణయిస్తారు? అని అన్నారు. ఇప్ప‌టికే జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల్లో ఇలాగే చెబితే జనం బీఆర్ఎస్‌ను బండకేసి కొట్టార‌న్నారు. బీఆర్ఎస్ బ్యాచ్‌ బ్యాడుమేళంలా తయారైంద‌ని ఎద్దేవా చేశారు.

రైతు భరోసా నిధులు విడుద‌ల

ఈ స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుద‌ల చేశారు. నేడు రైతు భరోసా కింద రూ.1009 కోట్లు రైతుల‌ ఖాతాల్లో జమయ్యాయ‌ని తెలిపారు. ఇప్పటి వ‌ర‌కు 1.45 కోట్ల ఎకరాలకు పెట్టుబ‌డి సాయం కింద‌ రైతు భరోసా నిధులు రూ.8,759 కోట్లు అంద‌జేసిన‌ట్లు చెప్పారు. దీంతో 74 ల‌క్ష‌ల మంది రైతుల‌కు మేలు జ‌రుగ‌నుంద‌న్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>