కలం, వెబ్ డెస్క్ : టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లోకి రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రవేశించడం, అక్కడ రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడంపై నిషేధం విధించారు. పాఠశాలలు కేవలం విద్యాబోధనకు, విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు మాత్రమేనని, అవి రాజకీయ వేదికలుగా మారకూడదని సీఎం విజయ్ స్పష్టం చేశారు. సీఎం విజయ్ ఆదేశాల మేరకు తమిళనాడు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల కాంచీపురంలోని ఒక ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలోకి రాజకీయ కార్యకర్తలు ప్రవేశించి సీఎం విజయ్ పోస్టర్లను అంటించడం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. దీంతో సీఎం విజయ్ తాజా నిర్ణయం తీసుకున్నారు. తన సొంత పార్టీ నేతలైనా సరే, పాఠశాలల పవిత్రతను దెబ్బతీస్తే సహించేది లేదని విజయ్ ఈ కఠిన నిబంధనను తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే తరగతి గదుల్లో కేవలం శాస్త్రవేత్తలు, జాతీయ నాయకుల ఫొటోలకు మాత్రమే అనుమతి ఉంటుందని విద్యాశాఖ పేర్కొంది. సీఎం విజయ్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం విద్యార్థుల భద్రతకు, ప్రశాంతమైన విద్యా వాతావరణానికి మరింత ఊతమిస్తుందని పలువురు విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

