‘చింతకాని’ సభలో చిక్కుముడులు వీడేనా?

కలం, ఖమ్మం బ్యూరో : ​రాజకీయ చైతన్యానికి, నూతన రైతాంగ ఉద్యమాలకు కేంద్ర బిందువైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. మధిర నియోజకవర్గం చింతకాని వేదికగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘రైతు ఆశీర్వాద సభ’ (Raythu Ashirwada Sabha)పైనే అందరి దృష్టి నెలకొంది. రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధుల పంపిణీ విజయోత్సవంగా, ప్రభుత్వం ఈ సభను జరుపుతున్నా.. క్షేత్రస్థాయిలో దశాబ్దాలుగా నలుగుతున్న జటిలమైన సమస్యలకు ఈ వేదిక సాక్షిగా పరిష్కారం దొరుకుతుందా లేదా అన్నదే ఇప్పుడు ప్రధానాంశం.

​రూ.9,000 కోట్ల నిధుల పంపిణీతో మెజారిటీ రైతులకు మేలు జరిగిన మాట వాస్తవమే అయినా.. సాంకేతిక కారణాలు, ఆధార్ అనుసంధాన లోపాలు, రేషన్ కార్డులు లేకపోవడం వంటి వంకలతో ఇంకా సుమారు 20వేల మంది అర్హులైన రైతులకు ఈ సాయం అందలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరంతా తమకు ఎప్పటిలోగా న్యాయం జరుగుతుందనే దానిపై ఈ సభ వేదికగా ముఖ్యమైన ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. దీనికి తోడు, రుణమాఫీ ఇంకా వర్తించని రైతాంగం తదుపరి విడతల అమలుకు సంబంధించి ఖచ్చితమైన డెడ్‌లైన్‌ను, అలాగే కౌలు రైతులకు చట్టపరమైన రక్షణతో కూడిన నిర్దిష్ట పెట్టుబడి హామీని ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నారు.

​అయితే, ఈ సభలో (Raythu Ashirwada Sabha) అందరికంటే ఎక్కువ ఉత్కంఠతో, ఆశగా ఎదురుచూస్తున్నది మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజనేతర రైతాంగమే. జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 1.75 లక్షల మంది రైతులలో 50,000 నుండి 60,000 మంది గిరిజనేతర (BC, SC, ఇతరులు) రైతులు ఉన్నారు. అశ్వారావుపేట, దమ్మపేట, జూలూరుపాడు, మణుగూరు, పినపాక వంటి ఏజెన్సీ ప్రాంతాల్లోని దాదాపు 1.50 లక్షల ఎకరాల సాగు భూమి వీరి ఆధీనంలోనే ఉంది. కానీ, ఇక్కడే 1/70 భూ బదిలీ నిరోధక చట్టం (LTR) వీరికి శాపంగా మారింది. జిల్లాలో సుమారు 60,000 ఎకరాల పైచిలుకు రెవెన్యూ భూములు ఈ చట్టం పరిధిలో వివాదాల్లో ఉండటంతో గిరిజనేతరులకు పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు లభించడం లేదు. ఫలితంగా వీరికి రైతు భరోసా, బీమా, బ్యాంక్ లోన్ తీసుకునే అవకాశం లేకుండా పోయింది.

​మరోవైపు, ఉమ్మడి జిల్లా మనుగడతో ముడిపడి ఉన్న పోడు భూముల సమస్య ఈ సభలో ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. జిల్లావ్యాప్తంగా పోడు హక్కుల కోసం దాదాపు 18,246 మంది గిరిజనేతర రైతులు దరఖాస్తు చేసుకోగా, వీరి ఆధీనంలో సుమారు 60,000 ఎకరాల అటవీ భూమి సాగులో ఉన్నట్లు గుర్తించారు.

కానీ, అటవీ హక్కుల చట్టం-2006 (ROFR) ప్రకారం గిరిజనేతరులకు పోడు పట్టాలు రావాలంటే వారు ఆ భూమిని 3 తరాలుగా (కనీసం 75 ఏళ్లుగా) సాగు చేస్తున్నట్లు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఈ కఠినమైన నిబంధన వల్ల వీరికి పట్టాలు దక్కడం లేదు. ఈ సుదీర్ఘ వేదనకు ముగింపు పలికేలా సీఎం నోటి నుంచి ఏదైనా ఉపశమన నిర్ణయం వస్తుందని వీరంతా ఆశగా చూస్తున్నారు.

​ఇక సాగునీటి రంగం విషయానికి వస్తే, జిల్లాకు జీవనాడి అయిన సీతారామ ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయడానికి అవసరమైన నిధుల కేటాయింపుపై, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని చివరి ఆయకట్టు భూములకు నీరందించేలా కాల్వల ఆధునీకరణపై సీఎం మాట్లాడాలని అక్కడి రైతులు కోరుతున్నారు.

వీటన్నింటితో పాటు జిల్లాలో విస్తారంగా పండే మిర్చి, పత్తి, పామాయిల్ పంటలకు ‘ధరల స్థిరీకరణ నిధి’ ఏర్పాటు చేయడం, స్థానికంగా మరిన్ని కోల్డ్ స్టోరేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించే సరికొత్త పారిశ్రామిక హామీలను కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు రేపటి చింతకాని వేదిక ద్వారా ఆశిస్తున్నారు. కేవలం పాత పథకాల ప్రస్తావనతో సరిపెట్టకుండా, ఈ దీర్ఘకాలిక సమస్యలపై ప్రభుత్వం ఇచ్చే ‘సరికొత్త హామీలు’ మాత్రమే ఈ సభను వంద శాతం విజయవంతం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>