కలం, వెబ్ డెస్క్: ఆర్మీ చీఫ్‌గా (Army Chief) బాధ్యతలు చేపట్టిన తరువాత జనరల్ ధీరజ్ సేథ్ మొదటిసారిగా జమ్మూ కశ్మీరులో పర్యటించారు. అత్యంత ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలైన పూంచ్, రాజౌరీ, సుందర్బనీ ప్రాంతాల్లో గంటల కొద్దీ సమయం గడిపారు.
అంతర్జాతీయ సరిహద్దు రేఖ వెంబడి తాజా పరిస్థితులు, భద్రతా ఏర్పాట్ల గురించి క్షుణ్ణంగా సమీక్ష చేశారు. కౌంటర్ ఆపరేషన్లు, ఇటీవల కాాలంలో జరిగిన చొరబాట్ల గురించి ఆరా తీశారు. ముష్కరులను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించవద్దని.. ఏరిపారేయాలని బలగాలను ఆదేశించారు.
సన్నద్ధతపై లోతైన సమీక్ష..
ఆర్మీ ఉత్తర కమాండ్ పరిధిలో బలగాల మోహరింపు, ఆపరేషన్లు జరుగుతున్న తీరుతెన్నులు, నిఘా విభాగాల సమన్వయం, త్రివిధ దళాల సన్నద్ధతపై గురించి లోతైన సమీక్ష చేశారు. అలాగే, సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వసతుల నిర్మాణంపైనా ఆరా తీశారు.
ప్రజలకు అవసరమైన అన్ని రకాల అవసరాలను తీర్చేందుకు సైన్యం కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు. చిట్టచివరి గ్రామానికి కూడా సదుపాయాలు అందేలా సైన్యం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆయుధాలు, డ్రోన్ల పరిశీలన..
తన పర్యటనలో భాగంగా ఆర్మీ చీఫ్ సైన్యం ఉపయోగిస్తున్న డ్రోన్లు, అత్యాధునిక ఆయుధాలను స్వయంగా పరిశీలించారు. మరీ ముఖ్యంగా డ్రోన్ల సర్వైలైన్స్ తీరును ఆపరేట్ చేశారు. ఈ సందర్బంగా టెక్నికల్ విభాగానికి పలు సూచనలు చేశారు. వైట్ నైట్ కార్ఫ్స్ కార్యాలయంలో అంతర్గత సమీక్ష చేశారు.

