Mobile Popup Ad
Mobile Popup Ad

తల్లీ బిడ్డ మృతి.. ప్రభుత్వంపై కవిత ఆగ్రహం

కలం, ఖమ్మం బ్యూరో: ​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడెంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 15 రోజుల కిందట తల్లీ బిడ్డ మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులను గురువారం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కలిసి పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న వారిని ఓదార్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ బాధ్యతారాహిత్యంపై నిప్పులు చెరిగారు.

ఈ దారుణాన్ని కప్పిపుచ్చడానికి అధికారులు నాటకాలాడారని కవిత మండిపడ్డారు. చనిపోయిన పాపకు ఆక్సిజన్ పెట్టి, ఇంకా బతికే ఉందంటూ నమ్మించారన్నారు. వాళ్ల అంత్యక్రియలు పూర్తయిన తర్వాత చితి బూడిదలో వైద్యులు నిర్లక్ష్యంగా వదిలేసిన కత్తెర దొరికిందన్నారు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి నిలదీసే వరకు అసలు విషయాన్ని దాచిపెట్టారని ధ్వజమెత్తారు.

సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు..

ఈ ఘోరానికి కారణం ఎవరో ప్రభుత్వం ఇప్పటికీ తేల్చలేదని, ప్రజలంతా తిరగబడి నిలదీస్తే కంటితుడుపుగా ఒకరిద్దరిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. తల్లీబిడ్డ మృతికి కారణమైన వైద్యంలో జరిగిన అసలు నిర్లక్ష్యాన్ని పక్కదారి పట్టించారని కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెద్ద పెద్ద అధికారులను కాపాడటానికి, కేవలం ఆశ వర్కర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని కవిత దుయ్యబట్టారు. ​మనుషుల ప్రాణాల కంటే ఈ ప్రభుత్వానికి ఏది ఎక్కువని ప్రశ్నించారు.

కనీసం పరామర్శించే బాధ్యత లేదా..?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఇంత పెద్ద ఘోరం జరిగితే కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించే తీరిక లేదా అని కవిత నిలదీశారు. అత్యంత వెనుకబడిన ఈ మారుమూల గ్రామానికి అవసరమైతే హెలికాప్టర్‌లో వచ్చి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మంత్రులకు లేదా అని ప్రశ్నించారు. తీవ్ర పేదరికంలో మగ్గుతున్న ఆ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

రెండు అంబులెన్స్‌లు పెట్టాలి..

​గుండాల, ఇల్లందు వంటి ప్రాంతాల్లో కనీసం సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా రావడం లేదని కవిత పేర్కొన్నారు. ఇలాంటి కమ్యూనికేషన్ లేని ప్రాంతాల్లో వైద్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అత్యవసర సేవల కోసం కనీసం రెండు అంబులెన్స్‌లను నిరంతరం అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. గుండాల పీహెచ్‌సీలో కంటితుడుపు చర్యలు ఆపి, గైనకాలజిస్ట్, ఇతర స్పెషలైజేషన్ సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.

మారని వైద్య రంగం..

తెలంగాణ వచ్చినా మారుమూల ప్రాంతాల్లో వైద్య రంగం పరిస్థితి ఏమాత్రం మారలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. గత 13 ఏళ్లుగా ఐటీడీఏలో ఎలాంటి రిక్రూట్‌మెంట్లు లేవన్నారు. జీసీసీని పూర్తిగా నిర్వీర్యం చేసి, వైద్యానికి సంబంధించిన కొనుగోళ్లు నిలిపివేశారని ఆరోపించారు.

ఇటీవల ఖమ్మంలో కూడా ఓ బాబుకు వైద్యం వికటించి చేయి తీసేయాల్సి వచ్చిందని కవిత గుర్తు చేశారు. ఆదివాసీల ప్రాణాలతో ఆటలొద్దని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన తరఫున పోరాడుతామన్నారు. పార్టీ పరంగా కుటుంబాన్ని ఆదుకుంటామని కవిత హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>