Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మంలో రాష్ట్రంలోనే తొలి ప్రైవేట్ ఆయిల్ పామ్ కాంప్లెక్స్

కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణ వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధిలో మరో కీలక అడుగు పడనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు కొత్త ఆర్థిక అవకాశాలు కల్పించేలా దేశీయ ప్రముఖ సంస్థ గోద్రేజ్ అగ్రోవెట్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలి ప్రైవేట్ సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ (Oil Palm Complex) ప్రారంభానికి సిద్ధమవుతోంది. నర్సరీ, పరిశోధన కేంద్రం, సీడ్ గార్డెన్, అత్యాధునిక ప్రాసెసింగ్ మిల్లును ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టు ప్రత్యేకంగా నిలుస్తోంది.

ఖమ్మం (Khammam) జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి, అంజనాపురం గ్రామాల పరిధిలో నిర్మితమవుతున్న ప్రాజెక్టు కోసం గోద్రేజ్ అగ్రోవెట్ సుమారు రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకు పెట్టుబడి పెట్టుతోంది. ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన నాణ్యమైన మొక్కల తయారీ నుంచి పండించిన గెలలను ప్రాసెస్ చేసి నూనె ఉత్పత్తి చేసే వరకు అన్నిసౌకర్యాలు ఒకే కేంద్రంలో అందుబాటులో ఉండనున్నాయి. దీంతో రైతులకు రవాణా వ్యయం తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా కానుంది. దేశంలోనే తొలిసారిగా ఒకే ప్రాంగణంలో నర్సరీ, పరిశోధన కేంద్రం, సీడ్ గార్డెన్‌తో పాటు పూర్తి స్థాయి ప్రాసెసింగ్ మిల్లును నడిపేలా గోద్రేజ్ సంస్థ ఈ మెగా ప్రాజెక్టును డిజైన్ చేయడం విశేషం.

తుది దశకు నిర్మాణ పనులు

ఈ మెగా ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 113.5 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ గంటకు 15 టన్నుల ఆయిల్ పామ్ గెలలను క్రష్ చేసే సామర్థ్యంతో అత్యాధునిక ప్రాసెసింగ్ మిల్లును నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. ప్రాజెక్టు పురోగతి, తుది దశ ఏర్పాట్లపై బుధవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లోని బోధి పెవిలియన్‌లో సీఎం రేవంత్ రెడ్డితో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి, ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగి సమావేశమయ్యారు.

రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన సమగ్ర నివేదికను వారు ముఖ్యమంత్రికి అందజేశారు. సీడ్ గార్డెన్ విస్తరణకు అదనంగా 35 నుంచి 40 ఎకరాల భూమిని కేటాయించాలని, సరుకు రవాణా సౌకర్యం మెరుగుపడేలా ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లే రహదారిని విస్తరించాలని కంపెనీ ప్రతినిధులు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం వెంటనే టీజీఐఐసీ ఆధ్వర్యంలో రహదారి విస్తరణ పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

వ్యవసాయానికి పరిశ్రమతో అనుసంధానం

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ ప్రాజెక్టు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇటీవల సచివాలయంలో గోద్రేజ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నాలుగో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌గా రూపుదిద్దుకుంటుండగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ఆయిల్ పామ్ రైతులకు దీర్ఘకాల ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో ప్లాంట్‌ను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యవసాయాన్ని పరిశ్రమతో అనుసంధానిస్తూ నిర్మిస్తున్న ఆయిల్ పామ్ కాంప్లెక్స్ తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు కొత్త ఊతమివ్వడంతో పాటు, ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించనుందని అధికారులు, రైతులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆయిల్ పామ్ ప్లాంట్.. యువతకు ఉపాధి

ఈ ప్రాజెక్టు ద్వారా వ్యవసాయ రంగానికే కాకుండా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా విస్తరించనున్నాయి. లాంట్‌లో సుమారు 150 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. రవాణా, నిర్వహణ, అనుబంధ సేవా రంగాల ద్వారా మరో 700 మందికిపైగా పరోక్ష ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>