కలం, వెబ్ డెస్క్ : మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే ఇరాన్‌పై యూఎస్ మిలిటరీ భీకర దాడులకు దిగింది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హార్మూజ్ జలసంధి వెంబడి ఉన్న ప్రధాన నగరాలు, ద్వీపాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దళం (US Airstrikes) విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఒక ఇరాన్ పౌరుడు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
హార్మూజ్ జలసంధి తీర ప్రాంతంలోని బుషెహర్, చబహార్, బందర్ అబ్బాస్, సిరిక్, జాస్క్ నగరాలతో పాటు అబు ఐలాండ్‌లో అమెరికా క్షిపణులు, బాంబులతో విరుచుకుపడటంతో ఆయా ప్రాంతాలు భారీ పేలుళ్లతో దద్దరిల్లాయి. ఈ దాడుల ధాటికి చబహార్ నగరంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమై, నగరం అంతటా చీకట్లు అలముకున్నాయి. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని, వ్యూహాత్మక స్థావరాలను బలహీనపరిచేందుకే ఈ దాడులు ప్రారంభించినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. హార్మూజ్ జలసంధి గుండా సాగే అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛకు ఇరాన్ ముప్పుగా పరిణమించిందని, వాణిజ్య నౌకలు, పౌర సిబ్బందిపై ఇరాన్ జరుపుతున్న దాడులకు నిరసనగానే ఈ కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని అమెరికా స్పష్టం చేసింది. ఈ తాజా దాడులతో గల్ఫ్ రీజియన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

